ఈనెలలో విడుదల అవుతున్న పెద్ద సినిమా ‘దేవర’. దీనిపైనే అందరి గురి ఉంది. ఈనెల 27న ‘దేవర’ ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే అదే రోజున నాని సినిమా ‘సరిపోదా శనివారం’ ఓటీటీలో విడుదల కానుందని సమాచారం. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ లో ఎగ్రిమెంట్ కూడా జరిగిపోయిందని తెలుస్తోంది. ‘సరిపోదా..’ ఇంకా థియేటర్లలో ఉంది కాబట్టి, నిర్మాతలు ఓటీటీ రిలీజ్ ని ఇంకా ప్రకటించలేదు. ‘సరిపోదా శనివారం’ థియేట్రిక్ రిలీజ్ డేట్ లాక్ అవ్వకముందే ఓటీటీ డేట్ ఫిక్సయ్యిందని సమాచారం. సినిమా విడుదలైన 4 వారాల తరవాత ఓటీటీలో ప్రదర్శించుకోవచ్చన్నది ఎగ్రిమెంట్. ఆగస్టు 29న ‘సరిపోదా శనివారం’ విడుదలైంది. 4 వారాలంటే.. సెప్టెంబరు 27తో లెక్క సరిపోతుంది. ‘సరిపోదా శనివారం’ చిత్రాన్ని గురువారం విడుదల చేయడం వెనుక కారణం కూడా ఇదే అని సమాచారం.
ఈమధ్య ఓటీటీలు తమ పంథా మార్చాయి. సినిమా రిలీజ్ డేట్ నిర్మాతల చేతుల్లో లేకుండా చేశాయి. ఓటీటీలో తమ స్లాట్ కు అనుగుణంగానే థియేట్రికల్ రిలీజ్ డేట్ నిర్ణయిస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్ లో సెప్టెంబరు 27న ఖాళీ దొరికింది. సరిగ్గా ఆ రోజే ‘సరిపోదా..’కి అలాట్ చేసింది. ఆరోజు ‘దేవర’ విడుదల అయినా కూడా నెట్ ఫ్లిక్స్ వెనక్కి తగ్గడం లేదు. సాధారణంగా ఓటీటీలోకి సినిమా విడుదలైన తొలి రోజుల్లోనే రికార్డు స్థాయి వ్యూస్ తీసుకురావాలని ఓటీటీ సంస్థలు ప్రయత్నిస్తుంటాయి. ఓ వైపు ‘దేవర’ వస్తుంటే ఓటీటీలో ఉన్న ‘సరిపోదా శనివారం’పై ప్రేక్షకుల గురి ఉంటుందా, లేదా? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.