భారతీయజనతాపార్టీ సీనియర్ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రస్తుతం కేంద్ర పట్టణాభివృద్ధి,పార్లమెంటరీ వ్యవహారాలుశాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుజిల్లాకు చెందిన నాయుడు 1949 జులై 1న చవటపాలెం అనే గ్రామంలో జన్మించారు. నెల్లూరు పట్టణంలో విద్యాభ్యాసం చేసిన ఆయన ఆంధ్రా యూనివర్సిటీనుంచి న్యాయశాస్త్ర పట్టా తీసుకున్నారు. చిన్ననాటినుంచి ఆరెస్సెస్‌తో అనుబంధం ఉండేది. 1974లో అఖిలభారతీయ విద్యాపరిషత్ తరపున విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్ నాయకుడిగా ఎన్నికయ్యారు. 1972నాటి జై ఆంధ్ర ఉద్యమంలో వెంకయ్య చురుకైన పాత్ర పోషించారు. 1978, 1983 సంవత్సరాలలో జనతాపార్టీతరపున ఉదయగిరినుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1980లో భారతీయజనతాపార్టీ యువవిభాగానికి ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనారు. 1985లో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించబడి 1988వరకు ఆ పదవిలో కొనసాగి ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1993నుంచి బీజేపీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 1998లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2000 సంవత్సరంలో కేంద్రంలో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధిశాఖమంత్రిగా పనిచేశారు. 2002 జులైనుంచి 2004 అక్టోబర్ వరకు భారతీయ జనతా పార్టీఅధ్యక్షుడిగా కొనసాగి మహారాష్ట్ర ఎన్నికలలో పార్టీ ఓటమికి నైతికబాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.