తెలుగుచలనచిత్రరంగంలో మెగాస్టార్‌గా సుప్రసిద్ధుడైన నటుడు చిరంజీవి అసలుపేరుకొణిదెల శివశంకర వరప్రసాద్. దాదాపు25 ఏళ్ళపాటు తెలుగుచలనచిత్రరంగంలో నంబర్ వన్ స్థానంలో కొనసాగారు. తర్వాతికాలంలో రాజకీయరంగంలో ప్రవేశించారు కానీ అక్కడ పెద్దగా రాణించలేకపోయారు.
కొణిదెల వెంకట్రావు,అంజనాదేవి దంపతులకు 1955 ఆగస్ట్ 22న పాలకొల్లులో చిరంజీవి జన్మించారు. వెంకట్రావు ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేసేవారు. చిరంజీవి బి.కామ్. చదువుకున్న తర్వాత సి.ఎ. చేయటంకోసం మద్రాస్ వెళ్ళారు. దానితోబాటుగా తనకు బాగా ఆసక్తిగా ఉన్న నటనలో శిక్షణ తీసుకోవటంకోసం మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరారు. ఆ కోర్స్ పూర్తిచేసిన తర్వాత మెల్లమెల్లగా చలనచిత్ర అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఎదిగారు. పునాదిరాళ్ళు, ప్రాణంఖరీదు, మనవూరి పాండవులువంటి చిత్రాలద్వారా గుర్తింపుతెచ్చుకున్నారు. 1980లో ప్రముఖ హాస్యనటుడు అల్లురామలింగయ్య కుమార్తె సురేఖతోవివాహం జరిగింది. 1984లో విడుదలైన ఖైదీచిత్రంద్వారా అగ్రస్థానానికి చేరుకున్నారు. 1980,90 దశకాలలో చిరంజీవి చిత్రాలు నిర్మాతలకు, పంపిణీదారులకు కనకవర్షం కురిపించాయి. ఆయన డాన్స్‌లు, ఫైట్స్ యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. అప్పుడప్పుడు క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవటానికి బాలచందర్, విశ్వనాథ్ వంటి దర్శకుల దర్శకత్వంలో రుద్రవీణ, స్వయంకృషి, ఆపద్బాంధవుడువంటి చిత్రాలలో నటించినప్పటికీ అవి పెద్దగా విజయం సాధించలేదు. మరోవైపు ఆజ్గా గూండారాజ్, ప్రతిబంధ్ వంటి చిత్రాలద్వారా బాలీవుడ్లో మంచి విజయాలే సాధించినప్పటికీ అక్కడ తనదైన ముద్రవేయలేకపోయారు.
నటుడిగా అగ్రస్థాయికి ఎదిగేక్రమంలో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ స్థాపించి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్లద్వారా సేవా కార్యక్రమాలుకూడా చేపట్టారు. దాంతో రాజకీయాలలో ప్రవేశించాలని ఒత్తిడి ప్రారంభమయింది. 2008 ఆగస్టులో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. తొలిరోజుల్లో ఆపార్టీకి పలువర్గాలనుంచి విశేష ప్రజాదరణ లభించింది. అదిచూసి కాంగ్రెస్, తెలుగుదేశంనేతలలో గుబులుకూడా ప్రారంభమయింది. అయితే అలా లభించిన ప్రజాదరణను ప్రజారాజ్యం ఎక్కువకాలం నిలబెట్టుకోలేకపోయింది. 2009 ఎన్నికల సమయానికి ఆ పార్టీ ప్రజాదరణ చాలావరకు పడిపోయింది. ప్రధాన పార్టీలకు తీవ్రపోటీ ఇస్తుందనుకున్న ప్రజారాజ్యానికి ఎన్నికలలో 18 స్థానాలు మాత్రమే లభించాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో పార్టీని నడిపలేక చిరంజీవి ప్రజారాజ్యాన్ని 2011లో కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆ పార్టీతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా కేంద్రంలో మంత్రిపదవి స్వీకరించారు. 2014 ఎన్నికలలో చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా కృషి చేసినప్పటికీ పెద్దగా ప్రభావం లేకపోయింది. ప్రస్తుతం 150వ చిత్రంకోసం చిరంజీవి సన్నద్ధమవుతున్నారు.
చిరంజీవికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చిన్న కుమార్తె శ్రీజ తండ్రికి చెప్పకుండా ఇంట్లోనుంచి పారిపోయి వివాహం చేసుకుని సంచలనం సృష్టించింది. ఆ పరిణామంతో చిరంజీవి చాలాకాలం మానసికంగా కుంగిపోయారు. కుమారుడు చరణ్ చిరుత చిత్రంద్వారా చలనచిత్రరంగ ప్రవేశంచేసి తండ్రికితగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. మరోవైపు తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో నంబర్ వన్‌గా కొనసాగుతున్నారు. మరో తమ్ముడు నాగబాబు నిర్మాతగా విఫలమవటంతో నటుడిగా కొనసాగుతున్నారు.