చిరంజీవి తన 150వ చిత్రం దర్శకత్వ బాధ్యతలను ఎన్నో తర్జనభర్జనల తర్వాత పూరి జగన్నాథ్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. పూరి స్వయంగా ఈ వార్తను తన ట్వీట్లద్వారా ప్రకటించారుకూడా. అయితే తాజా వార్తల ప్రకారం ఆ ప్రతిష్ఠాత్మక అవకాశాన్ని పూరి కోల్పోయినట్లు తెలుస్తోంది. పూరి వరసగా సినిమాలు ఒప్పుకుంటున్నట్లు మీడియాలో వార్తలు రావటం, నటి ఛార్మితో ఆయన వ్యవహారంవంటి పరిణామాల నేపథ్యంలో అతను ఈ ప్రాజెక్టు న్యాయం చేయలేరని, పూర్తిస్థాయిలో శ్రద్ధ పెట్టలేరని చిరంజీవి నిర్ధారణకు వచ్చినట్లు ఒక ఆంగ్ల దినపత్రిక ఇవాళ కథనం వెలువరించింది.
మరోవైపు మరో ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ గురువారం చిరంజీవితో భేటీకావటం పూరికి చిరు ఉద్వాసన పలికారన్న వార్తలకు బలంచేకూరుస్తోంది. వినాయక్ మెగా క్యాంప్‌కు మొదటినుంచి ఎంతో సన్నిహితంగా మెలుగుతున్న దృష్ట్యా అతను పూరి స్థానంలోకి రావటంలో ఆశ్చర్యమేమీలేదని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. వినాయక్ మెగా శిబిరానికి చేసిన సినిమాలన్నీ దాదాపుగా సూపర్ హిట్లేనన్న విషయం తెలిసిందే.
అటు నితిన్‌తో పూరి జగన్నాథ్ చేయబోతున్న చిత్రంకూడా రద్దయింది. ఈ చిత్రాన్ని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే ప్రొడక్షన్ వ్యవహారాలను ఛార్మి చూస్తుందని పూరి షరతు పెట్టటంతో నితిన్, ఆయన తండ్రి ఈ చిత్రాన్ని రద్దు చేసుకున్నారని సమాచారం. ఈ మొత్తం పరిణామాలు చూస్తుంటే పూరి జగన్నాథ్ వ్యవహారం మొత్తంమీద గాడి తప్పుతున్నట్లు అనిపించటం లేదూ!