హైదరాబాద్: సాధారణంగా పవన్ కళ్యాణ్‌ను పొగుడుతుండే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఈసారి రూటు మార్చారు. పవన్ రాజకీయాలపై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. పాలకులను ప్రశ్నిస్తానన్నవాడు ప్రశ్నించనప్పుడు లోకకళ్యాణానికి ద్రోహం…ఇది కళ్యాణ్ ద్రోహం అంటూ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. కళ్యాణం కోరుకునే జనాలకు పెళ్ళెప్పుడంటూ మరో ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలన్నీ తెలుగులోనే ఉండటం మరోవిశేషం. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో ఉండటం వర్మకు సహజమే అయినప్పటికీ పవన్‌పైన వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటం ఇదే మొదటిసారి. పవన్‌లాంటి ప్రజాదరణ ఉన్న వ్యక్తి రాజకీయాలలోకి రావాలని, పవన్ పవర్ అసమానమని ఇదివరలో వర్మ ఎన్నో ట్వీట్లు చేశారు.
రెండురోజులక్రితం తెలుగు రాష్ట్రాలలో తీవ్రంగా చర్చ జరుగుతున్న ఓటుకు నోటు అంశంపై వర్మ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబునాయుడు జాతీయస్థాయిలో ఆంధ్ర ప్రజల పరువును బజారుకీడ్చారని, ఆంధ్ర పౌరుడిగా తాను బాబువలన తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. అయితే ఈ కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన రేవంత్పైమాత్రం ప్రశంశలు కురిపించారు. కేసీఆర్ తన ముక్కుసూటితనానికి మొక్కుతున్నానని ట్వీట్ చేశారు.