గతేడాది ‘విరూపాక్ష’ తో ఓ సూపర్ హిట్ కొట్టాడు సాయిధరమ్ తేజ్. ‘బ్రో’లో తనకు అత్యంత ఇష్టమైన పవన్ కల్యాణ్ తో కలిసి నటించిన సంతృప్తి ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా రోడ్డు ప్రమాదం నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. 2024లో అతన్నుంచి ‘గంజా శంకర్’ రాబోతోంది. ‘సత్య’ అనే ఓ ఇండిపెండెంట్ షార్ట్ ఫిల్మ్ లో నటించాడు. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్‌తో తెలుగు 360 ప్రత్యేకంగా సంభాషించింది.
* హాయ్ అండీ.. ఇప్పుడు ఎలా ఉన్నారు? పూర్తిగా కోలుకొన్నట్టేనా?
– ఆ దేవుడి దయ, అభిమానులు, శ్రేయోభిలాషుల ఆశీస్సుల వల్ల బాగానే ఉన్నాడు. డిసెంబరులో మరో చిన్న సర్జరీ జరిగింది. దాంతో పూర్తిగా కోలుకొన్నాను. ఇకపై ఎప్పటిలానే సినిమాలపై దృష్టి పెట్టాలి.
* ఇదివరకటి కంటే చాలా కూల్‌గా… కామ్ గా కనిపిస్తున్నారు. ఫిలాసఫీ మాట్లాడుతున్నారు. కారణం ఏమిటి?
– చావు అంచుల వరకూ వెళ్లి వచ్చాను. బహుశా అందుకనేనేమో? నేను అంతకు ముందు నుంచీ కూల్.. అండ్ కామ్‌నే. యాక్సిడెంట్ తరవాత అది మరింత ఎక్కువ అయినట్టు ఉంది. నేను చేస్తోంది సరిపోవడం లేదు, ఇంకొంచె చేయమని భగవంతుడు ఇచ్చిన ఎగస్ట్రా టైమ్ ఇది అనుకొంటున్నా.
* ‘గాంజా’ శంకర్ ఎంత వరకూ వచ్చింది?
– వర్క్ జరుగుతోంది. సినిమాల విషయంలో కంగారు పడడం లేదు. స్క్రిప్టు విషయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకొంటున్నాను. ఒకసారి సినిమా పట్టాలెక్కిన తరవాత.. ఇక ఆగదు. సూపర్ స్పీడులో వర్క్ జరిగిపోతుంది.
* కొత్త కథలేమైనా విన్నారా?
– విన్నానండీ. కానీ ఏదీ కుదర్లేదు. కొన్ని కథలపై ఇంకాస్త వర్క్ చేయాలని అనిపించింది. అందుకే కొత్త సినిమాలేం ఒప్పుకోవడం లేదు. ఓటీటీలు వచ్చిన తరవాత.. వరల్డ్ సినిమా మనకు అందుబాటులోకి వచ్చేసింది. మనం కూడా క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వాల్సిందే.
* ఈ యేడాదైనా పెళ్లి కబురు వినిపిస్తారా?
– పెళ్లి విషయంలో తొందరలేదండీ. ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను కదా? ఇంటికొస్తే.. ‘లేట్ గా ఎందుకు వచ్చావ్’ అనేవాళ్లు ఉండరు. ఎక్కడికి వెళ్తున్నావ్ అని ఎవరూ అడగరు. బెడ్ అంతా నా ఒక్కడిదే. నా కాఫీ నేను పెట్టుకొంటా. నా టీ నేను తాగుతా..(నవ్వుతూ)
* సోలో లైఫే బెటరంటారు..
– (నవ్వుతూ) అంతేగా..! పెళ్లి చేసుకోను అని కాదు.. చేసుకొంటా. కానీ దానికి తొందర పడడం లేదు. అంతే.
* పుస్తకాలంటే చాలా ఇష్టమట.. ఈమధ్య చదివిన పుస్తకం ఏది?
– `ద పవర్ ఆఫ్ నౌ` అనే పుస్తకం నాలో బాగా స్ఫూర్తి ఇచ్చింది.
* ఫలానా పుస్తకం చదివితే బాగుంటుంది అని ఎవరికైనా సలహాలు ఇస్తారా?
– లేదండీ. ఎవరి ఇష్టం వాళ్లది. నా అభిరుచులు వేరు.. వాళ్ల అభిరుచులు వేరు కావొచ్చు. అందుకే పుస్తకాల విషయంలో ఎలాంటి సలహా ఇవ్వరు. ఎవరైనా ఇస్తే మాత్రం తీసుకొంటా.
* `బ్రో` కోసం త్రివిక్రమ్ తో కలిసి పని చేశారు. ఆయనేమైనా పుస్తకాల గురించి సలహాలు ఇచ్చారా?
– ఆయన సెట్ కి వచ్చిందే చాలా తక్కువ. మహా అయితే ఈ సినిమా విషయంలో మేం మూడు సార్లు కలిసి ఉంటాం. అంతే. మామధ్య పుస్తకాల ప్రస్తావన ఏం రాలేదు.
* మధ్యలో ‘సత్య’ అనే ఓ షార్ట్ ఫిల్మ్ చేశారు. కారణం ఏమిటి?
– రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి అది నా స్నేహితుడి కోసం చేశాను. ఇంకోటి దేశం కోసం. ఓ మంచి పాయింట్ ని జనంలోకి తీసుకెళ్లాలన్నది నా ఆలోచన. అందుకే షార్ట్ ఫిల్మ్ అని చూడలేదు. పైగా నా స్నేహితుడు నవీన్ ప్రతిభ నాకు తెలుసు. అది ఈ ప్రపంచానికి తెలియాలన్నది స్నేహితుడిగా నా స్వార్థం. అందుకే ఈ షార్ట్ ఫిల్మ్ చేశా. ఈనెలలోనే విడుదల చేస్తున్నాం.
* ఓకే అండీ.. ఆల్ ద బెస్ట్
– థ్యాంక్స్ ఎలాట్ అండీ..