ముద్రగడ పద్మనాభం గారికి, ప్రతి పనికీ రెండు పార్శ్వాలుంటాయి. ఆయా పనులను గమనించే వారి దృక్పథాన్ని, వారి ఆలోచన సరళిని బట్టి ఏ పార్శ్వం వైపు చూస్తారనేది ఆధారపడి ఉంటుంది. మనం ఏ పనిచేసినా మన మీద సానుకూలాభిప్రాయం ఉన్నవారు ఒక కోణంలోంచి, మన మీద దురభిప్రాయం ఉన్నవారు మరో కోణంలోను చూస్తారన్న సంగతి మనకు తెలుసు. సుదీర్ఘమైన జీవితానుభవం, రాజకీయానుభవం, ప్రజాజీవితానుభవం ఉన్న తమకు ఈ సంగతులు తెలియనివి కావు. అయితే కాపులను బీసీల్లో చేర్చడానికి సంబంధించి తక్షణం ఉత్తర్వులు రావాలనే డిమాండ్‌కు సంబంధించినంత వరకుా ఆ నిర్ణయం వలన అనుకూల- ప్రతికూల ఫలితాలు పడే అవకాశం లేని తటస్థ జీవులం మేము. కాబట్టి మీ ఉద్యమం పట్ల మాకు ప్రత్యేకంగా మంచి- చెడు అభిప్రాయాలు ఉండడానికి వీల్లేదు. మీ కులాలకు అన్యాయం జరుగుతుందనే భావన మీలో ఉన్నప్పుడు.. బాగుకోసం పోరాటపథాన్ని ఎంచుకోవడం సహేతుకం అనే మాకు అనిపిస్తుంది. కానీ ‘అనువైన సమయం’ అనేది ఒకటి ఉంటుంది కదా అనేదే మాకున్న అభ్యంతరం. మీరు రెండో విడత భార్యాసమేత నిరాహారదీక్షకు పూనుకుంటున్నారు. ఇనుము వేడిగా ఉండగానే దానిని వంచాలన్న సిద్ధాంతాన్ని అనుసరించి.. మొన్నటి తుని దుర్ఘటనలు, చెలరేగిన హింస తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఒక భీతావహ వాతావరణం ఇవన్నీ అలా సజీవంగా ఉండగానే హామీ పొందాలనే పట్టుదల మీలో ఉన్నట్లుగా ఈ దీక్ష నిర్ణయం ద్వారా కనిపిస్తున్నది. కానీ.. రెండో పార్శ్వం నుంచి ఈ దీక్ష లక్ష్యాన్ని గమనించినప్పుడు.. మంటలు ప్రజ్వరిల్లుతున్నప్పుడు మరింతగా ఎగదోస్తున్నట్లుగా ఈ దీక్ష ఉన్నదా? అనే భయసందేహాలు కలుగుతున్నాయి. దయతో ఆ కోణంలోంచి కూడా మీరు ఒకసారి గమనించండి. కాపుకులాల సంక్షేమాన్ని కాంక్షించే పెద్దదిక్కుగా మీరు స్థిరమైన ఇమేజిని సొంతం చేసుకున్నారు. అంతమాత్రాన మీరు మిగిలిన పౌర సమాజానికి శత్రువు కాదు. మాలాంటి అర్భకులు, అసహాయులు, సమాజంలో ఎలాంటి అల్లర్లు, అరాచకాలు జరుగుతూ ఉన్నా సరే నిర్లిప్తంగా చూస్తూ భయంతో బిక్కుబిక్కుమంటూ బతికే… మిగిలిన పౌరసమాజం మీ ద్వేషానికి అర్హమైనది కూడా కాదు. మాబోటి సామాన్యులున్న యావత్సమాజం పట్ల కూడా మీకు బాధ్యత ఉంది. మొన్న జరిగిన హింసకే మేం చిగురుటాకుల్లా కంపిస్తున్నాం. మీ దీక్ష పుణ్యమాని మరో హింస చెలరేగితే ఎలా తట్టుకోగలం? ఆలోచించండి. చంద్రబాబు తైనాతీల్లాగా.. ‘ఆయన అంతా చేసేస్తారు కదా? మీకు దీక్ష ఎందుకు దండగ?’ అని చెప్పడం మా ఉద్దేశం కాదు. మీరు దీక్ష చేయొచ్చు. కానీ వాతావరణం ఇంత వేడిగా ఉండగా కాకుండా.. చల్లారిన తర్వాత చేస్తే సమాజహితం కోరినట్లుంటుందని మా కోరిక. ఇప్పటికి కూడా కొత్తగా వేసిన కమిషన్‌కు మూడు నెలల గడువు పెడితే, ఆ మేరకు ప్రభుత్వం ప్రకటిస్తే.. దీక్ష చేయబోనని మీరు అంటున్నారు. మీ ముఖప్రీతికి చంద్రబాబు ప్రకటన చేసి, మూణ్నెల్ల తర్వాత ‘సమయం చాల్లేదు తూచ్’ అంటే మీరేం చేస్తారు? అప్పుడు మళ్లీ దీక్షకు కూర్చుంటారంతే కదా? కనుక ‘రిజర్వేషన్’ అనే పదంతో ఎలాంటి నిమిత్తమూ లేని మాబోటి వారందరి విజ్ఞప్తి ఏంటంటే.. మీరు మీ అంతగా అటు ప్రభుత్వానికి, ఇటు కమిషన్‌కు కూడా మూడు నెలల గడువు విధించండి. ఆలోగా నివేదిక పూర్తిచేయకుండా.. రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తానని హెచ్చరించండి. వారి రాజకీయ పరమైన హామీ కోసం ఎందుకు ఎదురుచూస్తారు? మీరే సమాజం తరఫున ఓ గడువు ప్రకటించి, వారికి వ్యవధి ఇచ్చి.. దానిని గౌరవించకపోతే.. అప్పుడు మళ్లీ మీ ఆగ్రహజ్వాలల రుచి చూపించండి. అది కేవలం ఒక్క కులాన్ని కూడా కాకుండా సమాజపు మంచిని కూడా కాంక్షించే నాయకత్వ లక్షణం అనిపించుకుంటుంది. అంతే తప్ప.. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మంటలకు ఆజ్యం జతచేసినట్లుగా.. రాష్ట్రం అట్టుడుకుతున్న వేళ మళ్లీ దీక్షలకు దిగితే.. అవాంఛనీయ సంఘటనలు ఎలాంటివి జరిగినా.. దానికి కేవలం ప్రభుత్వాన్ని నిందించడం వల్ల ఉపయోగం ఉండదు. మీది కూడా సమాన బాధ్యత ఉంటుంది. దయతో గమనించండి. – ప్రేమతో ఇతర కులాలకు చెందిన మీ ఆత్మబంధువులు