రవితేజ దగ్గర ఓ అలవాటు ఉంది. సెట్లో బాగా కష్టపడతాడు. దానికి తగ్గట్టుగానే నిర్మాతల ముక్కు పిండి మరీ తన పారితోషికాన్ని వసూలు చేస్తాడు. పారితోషికం విషయంలో తనది రాజీ లేని వ్యవహారం. ఒక్కసారి రెమ్యునరేషన్ ఫిక్సయ్యిందంటే, అందులో ‘నో’ రిబేట్. ఇటీవల రవితేజ సినిమాలు చాలా వరకూ బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టాయి. ఏనాడూ… నిర్మాతలకు తన పారితోషికం తిరిగి ఇచ్చి, ఆదుకొన్న దాఖలా లేదు. అలా చేయాలన్న రూలూ లేదనుకోండి. అది వేరే విషయం. అయితే ‘మిస్టర్ బచ్చన్’ విషయంలో మాత్రం రవితేజ మారాడు. పారితోషికంలో రూ.4 కోట్లు మినహాయించుకొన్నట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్.
‘మిస్టర్ బచ్చన్’ తీసిన టి.జి.విశ్వ ప్రసాద్ హోల్ సేల్ గా నష్టపోయారు. ఓటీటీ, శాటిలైట్ నుంచి మినహా, థియేటర్ల నుంచి ఆయనకు పైసా కూడా రాలేదు. ఈ మధ్య తమ సంస్థని భారీగా ముంచేసిన సినిమా ఇదేనని ఆయన బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చారు. దర్శకుడు హరీష్ శంకర్ తన పారితోషికాన్ని కొంత మేర తిరిగి ఇచ్చారు. మరి రవితేజ కూడా అదే బాటలో నడుస్తాడా, లేదా? అనే చర్చ నడిచింది. చివరికి రవితేజ ఇలా ముందుకు రావడంతో ఆ అనుమానాలు తీరిపోయాయి. రవితేజ పారితోషికం అటూ ఇటుగా రూ.25 కోట్ల వరకూ ఉంది. అందులో రూ.4 కోట్లు చిన్న మొత్తంలానే కనిపించొచ్చు. కాకపోతే ఇది వరకు ఇలాంటి సర్దుబాట్లు కూడా ఉండేవి కావు. ఇప్పుడు ఎంతో కొంత తిరిగి ఇచ్చాడు. అదే సంతోషం. మరోవైపు తన తదుపరి సినిమా విషయంలో పారితోషికంలో నిర్మాతలకు భారీ రిబేటు ఇచ్చాడని తెలుస్తోంది. వరుసగా ఫ్లాపులు తగులుతుంటే, ఏ హీరో అయినా కాస్త దిగి రావాల్సిందే. రవితేజ అలా దిగొచ్చాడు. ఎలాగోలా రవితేజలో మార్పు మొదలైంది. ఈ మార్పు మంచిదే.