చాలా మంది హీరోలు, టెక్నీషియన్లు చిత్ర నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్స్‌లు తీసుకుని, ఆ సినిమాలకు తగిన డేట్స్ ఇవ్వడం లేదు. తర్వాత ఒప్పుకొన్న సినిమాలకు సమయాన్ని కేటాయిస్తున్నారు. దీని వల్ల మొదట అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాత తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ట్రెండ్ ఎప్పటికీ నుంచో వుంది. అయితే తాజాగా తమిళ చిత్ర నిర్మాతల మండలి ఈ విషయంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు సంచలనంగా వున్నాయి.
చిత్ర పరిశ్రమలో నెలకొన్న వివిధ సమస్యలపై చర్చలు జరిగిపిన మండలి కొన్ని ఆసక్తికరమైన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా హీరోల యథేచ్ఛగా తీసుకునే అద్వాన్సులపై ఉక్కుపాదం మోపేలా, అడ్వాన్సులు సంస్కృతికి చరమగీతం పాడేలా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ముందుగా ఆగస్టు 16వ తేదీ తర్వాత కొత్త సినిమాల షూటింగ్ మొదలు పెట్టకూడదని ప్రకటించింది. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న సినిమాలన్నీ అక్టోబరు 31వ తేదీలోగా పూర్తి చేయాలని ఆయా చిత్ర బృందాలకు సూచించింది.
Also Read :‘తమిళ్ రాకర్స్’ కింగ్‌పిన్ దొరికాడు
ఇక నుంచి ఎవరి దగ్గరైతే మొదట అడ్వాన్స్ తీసుకొన్నారో వారి సినిమా పూర్తయిన తర్వాతే మరొక చిత్రానికి పనిచేయాలని చెప్పింది. ఇదే సందర్భంలో హీరో ధనుష్ విషయం ప్రస్థావనలోకి వచ్చింది. ఆయనకు వివిధ చిత్ర నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్స్‌లు వెళ్లాయి. కానీ ఆయనకి నచ్చిన విధంగా డేట్లు కేటాయిస్తూ వెళ్తున్నారు. ఇకపై ఈ విధానానికి అంగీకరీంచేదే లేదు. ముందు అడ్వాన్స్ తీసుకున్న సినిమా పూర్తయిన తర్వాతే కొత్త సినిమా మొదలుపెట్టాలని ఖరాకండీ గా చెప్పింది. అలాగే ప్రస్తుతం జరుగుతున్న సినిమాలు షూటింగులన్నీ పూర్తయిన తర్వాతే కొత్త సినిమాలు మొదలుపెట్టాలని ఓ నిబంధన తెచ్చింది. ఇందుకు అక్టోబరు 31ని డెడ్ లైన్ గా పెట్టింది. అలాగే ఓటీటీ సినిమాల విషయంలో ఎనిమిది వారాల రూల్ ని ప్రవేశపెట్టింది.