ఆదిపురుష్ విడుదలైంది. తొలి రోజు బాక్సులు బద్దలు కొట్టే వసూళ్లు వచ్చాయి. దాంతో పాటు సినిమానీ భారీగా ట్రోల్ చేస్తున్నారు. వాల్మీకి రాసిన రామాయణం కాదని, ఇది ఓం రౌత్ రాసుకొన్న రామాయణం అంటూ… ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు. గెటప్పుల మీద, సెట్స్ మీద, డైలాగుల మీద… ఇలా.. దేన్నీ వదల్లేదు. అన్నిటా ట్రోలింగే. ఈమధ్య కాలంలో ఇంత భారీగా ట్రోల్ అయిన సినిమా ఇదేనేమో..? ఈ విమర్శల వాన ముందు నుంచీ ఊహిస్తున్నదే. కాకపోతే.. ఈ స్థాయిలో ఉంటుందని ఎవరూ ఊహించలేదు. ఓం రౌత్ ఈ సినిమాని ఈతరానికి నచ్చేలా తీద్దామనుకొన్నాడు. అతని ఉద్దేశ్యం మంచిదే కావొచ్చు. కానీ.. చరిత్ర అంటూ ఒకటి ఉంది. ఇతిహాసాలకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందరూ బలంగా నమ్మే ఓ విషయాన్ని మార్చి చెప్పడానికి ధైర్యం కావాలి. ఆ మార్పు సవ్యంగా లేకపోతే.. వక్రీకరణ అనే అపవాదు మోయాల్సివస్తోంది. ఓం రౌత్ ట్రోల్ అవ్వడానికి కారణం ఇదే. వాల్మీకీ రామాయణం ఆధారంగా ఈ సినిమా తీశా, అని చెప్పుకొంటున్న ఓం రౌత్… వాల్మీకీ రామాయణంలోని కొన్ని కీలక అంశాల్ని తప్పుదోవ పట్టించాడు. అది తెలిసి చేశాడో, తెలియక చేశాడో, తెలిసి కూడా.. తనదైన శైలి ఆపాదించడానికి చేశాడో తెలీదు కానీ… విమర్శలు మాత్రం తప్పడం లేదు. ఆదిపురుష్ చూడగానే… ఓం రౌత్ చేసిన కొన్ని బ్లండర్ మిస్టేక్స్ అర్థమైపోతుంటాయి. వాటిలో మచ్చుక్కి కొన్ని…
01. రామ లక్ష్మణుల ముందే సీతని రావణుడు ఎత్తుకెళ్లినట్టు చూపించాడు ఓం రౌత్. ఇది అక్షరాలా రామాయణాన్ని వక్రీకరించడమే. రాముడి సమక్షంలో సీతని రావణుడు అపహరించినట్టైతే.. రాముడి శక్తి, ధైర్యం, తెగువ, సీత పట్ల ప్రేమ ఏమైనట్టు.. అన్నది వాల్మీకి రామాయణం క్షుణ్ణంగా చదివిన వాళ్ల ప్రశ్న. దీనికి ఓం రౌత్ దగ్గర సమాధానం ఉందా..?
02.లక్ష్మణుడ్ని శేషూ… అని పిలుస్తాడు రాముడు. లక్ష్మణుడికి రకరకాల పేర్లున్నా… అందులో శేషు లేదు. రామాయణంలో ఇలాంటి పేరు అస్సలు ప్రస్తావనకే రాలేదు. రాముడ్ని రాఘవ అని పిలుచుకొంటారు. సీతకి జానకిగా అభివర్ణిస్తారు. హనుమంతుడ్ని భజరంగీ అని పిలుచుకొంటారు. కానీ లక్ష్మణుడ్ని శేషూ అనడదం ఏమిటి విచిత్రంగా..?
03. లంక.. ఎప్పుడూ సువర్ణ శోభితమే. కుబేరుడి దగ్గర్నుంచి రావణాసురుడు బంగారం లాక్కున్నాడు. ఆ బంగారంతో.. లంక ఎప్పుడూ మెరిసిపోతుంటుంది. కానీ.. ఓం రౌత్ మాత్రం లంకని భూత్ బంగ్లాల కంటే దారుణంగా చూపించాడు.
04. సీతని రావణుడు ఎత్తుకెళ్లాడు. తనని దక్కించుకోవాలని పలు రకాలుగా ప్రయత్నించాడు. కానీ ఏనాడూ.. సీతమ్మ రావణుడ్ని కన్నెత్తి చూడలేదు. గడ్డిపోచని చూసినట్టు చూసింది. గడ్డిపోచతోనే మాట్లాడింది. అలాంటిది.. సీతకూ, రావణుడికీ మధ్య ముఖాముఖీ డైలాగులు సృష్టించాడు ఓం రౌత్. ఇదెక్కడి రామాయణం అన్నది అందరి ప్రశ్న.
05. కుంభకర్ణుడికీ, ఆంజనేయడికీ మధ్య ఓ ఫైట్ సృష్టించాడు రౌత్. కేవలం.. ఇద్దరు బలవంతులు కొట్టుకొంటే ఎలా ఉంటుందో చూపించాలన్నది రౌత్ ఆలోచన కావొచ్చు. కానీ కుంభకర్ణుడు కొడుతుంటే, ఆంజనేయుడు ఎగిరెగిరి పడేలా సీన్ డిజైన్ చేయడం… హనుమాన్ భక్తులకు నచ్చడం లేదు. ఇది రామాయణంలో లేదు కదా.. అన్నది వాళ్ల మాట.
06. వాల్మీకి రాయణం ప్రకారం లక్ష్మణుడ్ని సీతమ్మ శంకించింది. అందుకే.. సీతని వదిలి వెళ్లాడు. ఆ సమయంలో… రావణుడు వచ్చి సీతమ్మని ఎత్తుకెళ్లాడు. దాన్ని మరోలా చూపించాడు రౌత్. లక్ష్మణ రేఖ గీసినట్టు, దాన్ని సీత దాటి వచ్చినట్టు.. ఆ సన్నివేశాన్ని డిజైన్ చేశాడు. ఇది కూడా వాల్మీకీ రామాయణానికి విరుద్ధమే.
07. రాముడి వస్త్రధారణ కూడా సవ్యంగా లేదు. ముఖ్యంగా తెల్లని దుస్తుల్లో జీసెస్లానో, మెహర్ బాబాలానో చూపించే ప్రయత్నం చేశారు. లంకాధీశుడు గొప్ప శివభక్తుడు. అయినా సరే… నుదుటన బొట్టు లేదు. సీతమ్మ కాస్ట్యూమ్స్ పై కూడా విమర్శలు ఉన్నాయి. మండోదరిని విధవగా చూపించడం… రౌత్ తీసుకొన్న టూమచ్ లిబర్టీ.
08. హనుమంతుడితో… ఊర మాస్ డైలాగులు చెప్పించాడు రౌత్. నీ బాబుది… ఉతికేస్తా.. అనే డైలాగులు మరీ టూమచ్‌గా ఉన్నాయి. బహుశా.. ఇది తెలుగు డబ్బింగ్ వల్ల వచ్చిన వైపరిత్యం కావొచ్చు.
09. రావణుడు సర్పాలతో మసాజ్ చేసుకొంటున్న సీన్ ఏదైతే ఉందో… అది ఓం రౌత్ మితిమీరిన సృజనకు నిలువుటద్దం.
10. తొలి సన్నివేశంలో రావణుడి తపస్పు మెచ్చి ప్రత్యక్షమైన బ్రహ్మ… ఎక్కడా బ్రహ్మలా కనిపించడు. సాదా సీదా సన్యాసిలా దర్శన మిస్తాడు. ‘నేను బ్రహ్మని..’ అని ఆ పాత్రతో చెప్పించాల్సిన అవసరం వచ్చిదంటే – రౌత్ ఆ పాత్రని ఎలా డిజైన్ చేశాడో ఊహించుకోవచ్చు.