విశాఖను ప్రమాదాలు వదిలి పెట్టడం లేదు. తాజాగా విశాఖలోని హిందూస్థాన్ షిప్ యార్డులో జరిగిన ప్రమాదంలో ఏకంగా పది మంది చనిపోయారు. సరుకును నౌకల్లోకి ఎగుమతి, దిగుమతి చేసేందుకు భారీ క్రేన్లు ఉంటాయి. అలాంటి ఓ క్రేన్ పనితీరును సిబ్బంది పరిశీలిస్తున్న సమయంలో ఒక్క సారిగా కుప్ప కూలింది. ఆ క్రేన్ కింద… ఉద్యోగులు ఉండిపోయారు. పదిమంది చనిపోయారు. పలువురుకు తీవ్ర గాయాలయ్యాయి.క్రేన్ శిథిలాలను… రక్షణ శాఖ సిబ్బంది తొలగించడం ప్రారంభించారు. శిథిలాల కింద మరింత మంది ఉంటారనే ఆందోళన వ్యక్తమవుతోంది.
విశాఖలో కొద్ది రోజులుగా వరుసగా పారశ్రామిక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎల్జీ పాలిమర్స్ సంస్థలో గ్యాస్ లీకేజీ ఘఠన దగ్గర్నుంచి… ఒక దాని తర్వాత ఒకటి.. వరుసగా ఏదో ఓ కెమికల్ ఫ్యాక్టరీలోప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కార్మికుల ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగినప్పుడు.. హడావుడి చేసి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటించిన ప్రభుత్వం..తర్వాత పట్టించుకోవడం మానేసింది. పరిహారం కూడా… అధికారికంగా ప్రకటించడం లేదు. అన్ని పారిశ్రామిక సంస్థల్లోనూ భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తామని..చెబుతున్నారు కానీ..ఎక్కడా అమలవ్వడం లేదు.
హిందూస్థాన్ షిప్ యార్డ్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే సంస్థ. లాక్ డౌన్ కారణంగా కార్యకలాపాలు తగ్గిపోవడంతో.. క్రేన్లను వినియోగించడం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు.. అలాంటి క్రేన్ల పనితీరును.. పరిశీలిస్తున్న సమయంలో ఒక్క సారిగా కుప్ప కూలింది. కొన్ని వందల ఎత్తులో…అత్యంత బరువుగా ఉండే క్రేన్ కుప్పకూలడం..దాని కింద కార్మికులు నలిగిపోవడం తీవ్ర విాదానికి కారణం అయింది. సంఘటనా స్థలానికి పెద్ద ఎత్తున కార్మికులు, ఉద్యోగుల బంధవులు తరలి వచ్చారు. ఎవర్నీ లోపలికి అనుమతించలేదు. దాంతో.. వారు.. గేటు బయటే రోదిస్తూ.. నిలబడ్డారు.