గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల పథకంలో భారీగా గోల్ మాల్ జరిగిందని ఆరోపణలు చేసిన ప్రభుత్వ పెద్దలు ఈ స్కీమ్ పై విచారణకు ఆదేశించబోతున్నారా? ఇప్పటికే అధికారులు ఈ స్కామ్ పై ఆరా తీయడం ప్రారంభించారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
బతుకమ్మ చీరల స్కీమ్ లో భారీగా అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలోనూ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. బతుకమ్మ చీరల స్కామ్ పై విచారణకు సిద్దమా అంటూ కేటీఆర్ ను అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించారు. ఈ క్రమంలోనే బతుకమ్మ చీరల స్కీమ్ పై అధికారులు ఆరా తీస్తున్నారని సమాచారం. 1000 కోట్ల స్కామ్ జరిగిందని ప్రాథమికంగా గుర్తించినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణలోని చేనేత కార్మికులను ప్రోత్సహించాలని బతుకమ్మ చీరల పంపిణీ చేపడుతున్నామని గత ప్రభుత్వ పెద్దలు గొప్పగా చెప్పుకున్నారు. కానీ, సూరత్, బీవండి నుంచి తక్కువ ధరకు చీరలను కొనుగోలు చేసి, ఎక్కువ ధరకు కొనుగోలు చేసినట్లుగా గులాబీ నేతల బినామీలు సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో చీరకు 25, 30రూపాయలు ఖర్చు అయితే, 250, 300ఖర్చు అయినట్లుగా చూపించి భారీగా వెనకేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
2017నుంచి ప్రారంభమైన ఈ బతుకమ్మ చీరల పంపిణీని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ నేతల బినామీలు భారీగా క్యాష్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ స్కీమ్ కోసం ఏడేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2,170కోట్లు ఖర్చు చేసింది. ఇందులో 1000కోట్ల వరకు బీఆర్ఎస్ నేతలే సొమ్ము చేసుకున్నారని తెలుస్తోంది. దీంతో ఈ కుంభకోణంపై విచారణ జరిపించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే అధికారులు రంగంలోకి దిగారని , ప్రాథమిక నివేదిక పరిశీలన అనంతరం సర్కార్ విచారణకు ఆదేశించే అవకాశం ఉంది.