2021లో అతి పెద్ద సినిమాగా పుష్ప నిలిచింది. డివైడ్ టాక్ వచ్చినా, థియేటర్ల దగ్గర విపత్కర పరిస్థితి ఉన్నా – ఈ సినిమా ఇంత రేంజ్ లో వసూళ్లు సాధించడం నిజంగా అబ్బురపరిచే విషయం. పార్ట్ 1 కి దాదాపుగా రూ.180 కోట్లు ఖర్చు పెట్టినట్టు లెక్క తేలింది. అయితే.. ఇందులో వేస్టేజీ విపరీతంగా ఉందని టాక్. ఎడిటింగ్ టేబుల్ దగ్గర తీసేసిన సీన్ల విలువ దాదాపుగా రూ.12 కోట్లకు పైమాటే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో ఓ భారీ యాక్షన్ సీన్ ఉందట. ఈ రోజుల్లో పెద్ద సినిమా తీయడం అంటే మాటలు కాదు. రోజుకి ప్రొడక్షన్ కాస్ట్ దాదాపుగా రూ.30 నుంచి 40 లక్షలకు పైమాటే. పది రోజులు వేస్ట్ అయ్యిందంటే… నాలుగు కోట్లు లేచిపోతుంది. అలాంటి వేస్టేజీలు పుష్ప విషయంలో చాలా జరిగాయట. పార్ట్ 2కి ఉపయోగపడతాయి అనుకున్న సీన్లు కొన్ని పూర్తిగా పనికి రాకుండా పోయాయని తెలుస్తోంది. డిలీట్ చేసిన కొన్ని సీన్లు యూ ట్యూబ్లో కనిపిస్తున్నాయి. అయితే ఇంకొన్ని కనీసం ఎడిటింగ్ కూడా చేయకుండా అలా వదిలేశార్ట. ఈ వేస్టేజీలన్నీ తగ్గించుకుంటే -పుష్ప బడ్జెట్ మరింతగా తగ్గేది. పార్ట్ 2లో అయినా… ఈ వేస్టేజీలు లేకుండా చూసుకుంటే మంచిదేమో..?