మూడు రోజుల ముందే ఏపీ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తుల్ని నియమించేందుకు సిఫారసు చేసిన సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం.. ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకు 12 మంది కొత్త జడ్జిలను నియమించాలని కేంద్రానికి సిఫారసు చేసింది. వీరిలో ఏడుగురు లాయర్లు, ఐదుగురు న్యాయాధికారులు. ఫిబ్రవరి ఒకటో తేదీన జరిగిన కొలీజియం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని సుప్రీంకోర్టు తెలిపింది.
సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచారు. న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఖాళీల భర్తీ చేపడుతూ వస్తున్నారు.గత సెప్టెంబర్లోనే జ్యుడిషియల్ సర్వీసెస్ నుంచి ఏడుగుర్ని సుప్రీంకోర్టు కొలీజియం న్యాయమూర్తులుగా సిఫార్సు చేసింది. కేంద్రం ఆమోదించడంతో వారు న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టారు.
గత సెప్టెంబర్లో హైకోర్టు చరిత్రలో ఒకేసారి ఏడుగురు.. అందులో నలుగురు మహిళలు ప్రమాణం చేశారు. ఈ సారి కేంద్రం కొలీజియం చేసిన సిఫార్సులు ఆమోదిస్తే మరో రికార్డు సృష్టించినట్లవుతుంది. దేశంలోని వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తుల కొరత వల్ల కేసులు పెడింగ్ పడిపోతున్నాయి. ఈ ఇబ్బందిని గుర్తించిన సీజేఐ ఎన్వీ రమణ న్యాయమూర్తుల నియామకంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.