కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు! త్వరలోనే పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల 26 నుంచి చలో అమరావతి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. కాపుల రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నాన్చుడు ధోరణికి నిరసనగా ఈ యాత్ర చేయబోతున్నారు. కాపుల రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం మంజునాథ కమిషన్ ను నియమించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ జస్టిస్ మంజునాథ్ తాజాగా మాట్లాడుతూ… కమిషన్ నివేదిక ఇచ్చినంత మాత్రాన కాపులకు రిజర్వేషన్లు వచ్చేస్తాయన్న గ్యారంటీ లేదనీ, ఇది బీసీల వెనుబాటుతనంపై జరుగుతున్న అధ్యయనం అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ముద్రగడ కూడా స్పందించారు. రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డబుల్ గేమ్ ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎప్పుడో గత ఏడాది ఆగస్టు నాటికే కమిషన్ రిపోర్టు ఇచ్చేస్తుందనీ, రిజర్వేషన్లు తేల్చేస్తామని చెప్పి.. ఇప్పుడు మాట మార్చుతున్నారని తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో చలో అమరావతికి ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు.
అయితే, ప్రతీసారీ జరిగేదే ఇప్పుడూ మొదలైంది!ముద్రగడ పాదయాత్రకు చాలా సమయం ఉన్నా కూడా ప్రభుత్వం ఇప్పుడే స్పందించేసింది! ముద్రగడ స్వస్థలం కిర్లంపూడిలో పోలీసులు 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు. ఎలాంటి హడావుడీ లేకపోయినా ముద్రగడ ఇంటి ముందు పోలీసుల పహారా మొదలైపోయిందట! ఎందుకీ హడావుడి అని అధికారులను ప్రశ్నిస్తే.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని వారు అంటున్నారట! అంతేకాదు, జిల్లా అంతటా కూడా సెక్షన్ 30ని కూడా అమల్లోకి తెచ్చేశారు. ముద్రగడ పాదయాత్రకు ప్రభుత్వ అనుమతి లేదని గతంలో వినిపించిన వాదనే మళ్లీ వినిపిస్తున్నారు!
అయితే, ప్రతీసారీ జరుగుతున్నట్టే ముద్రగడ పట్టుదలతో ఉన్నారు. ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పరిస్థితులు ఎలా ఉన్నాసరే.. తాను పాదయాత్ర చేసి తీరతానని ముద్రగడ అంటున్నారు. కాపుల రిజర్వేషన్లను వెంటనే ప్రకటించాలనీ, ఈసారి తన ఉద్యమాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని ఆయన చెబుతున్నారు. కానీ, ముద్రగడ చేపట్టబోయే కార్యక్రమానికి ముందస్తు అనుమతులు తప్పనిసరినీ పాత పాటే పాడుతున్నారు అధికారులు! ముద్రగడ దీక్షకు ఇంకా 20 రోజులు సమయం ఉంటుండగానే కిర్లంపూడిలో సెక్షన్ 144 పెట్టేయడమేంటో..? కాపుల రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం స్పందన అంటే… కేవలం ముద్రగడను అడ్డుకోవడమే అన్నట్టుగా ఉంది! ముద్రగడ కార్యాచరణ ప్రకటించడం.. ఆయన్ని గృహనిర్బంధం చేయడం అనే హైడ్రామా రొటీన్ గా మారిపోయింది! మరి, తాజా ఉద్యమ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.