తూర్పుగోదావరి జిల్లా గండేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ప్రాంతంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉండగా లారీ రహదారి పక్కకు దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో లారీలో ప్రయాణిస్తున్న 16 మంది వ్యవసాయ కూలీలు అదే లారీలో ఉన్న పారిశ్రామిక బూడిద కింద పడి సజీవసమాధి అయిపోయారు. ప్రమాదం గమనించి లారీలో నుంచి దూకి వేయడంవల్ల మరో 16 మందికి గాయపడ్డారు. ఇందులో ఆరుగురు అతితీవ్రంగా గాయపడ్డారు వారిక ప్రాణాపాయమేమీలేదని డాక్టర్లు చెబుతున్నారు. పరిస్ధితి క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మృతులంతా జిల్లాలోని తొండంగి, ప్రత్తిపాడు, తుని, రౌతులడికి గ్రామాలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఆగస్టు 23న పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడికి యూకలిప్టస్ (జామాయిల్) చెట్లునరికే కూలిపనికి ఒక జట్టుగా 36 మంది కూలీలు వ్యవసాయ పనులకు వెళ్ళారు. పనులు ముగించుకొని ఏలూరి నుంచి నిన్న రాత్రి లారీలో వారి స్వస్థలాలకు తిరిగి వెళ్ళడానికి ఈ లారీ ఎక్కారు.
విజయవాడ వద్ద ధర్మల్ విద్యుత్ కేంద్రంనుంచి వ్యర్ధపదార్ధంగా వెలువడే బూడిద “ఫ్లయ్ యాష్” ను సిమెంటుతో కలిపి హాలో / ఫాల్జీ ఇటుకలు చేయడానికి, గ్రేడు తక్కువరకాల సిమెంటు ఉత్పత్తికీ ఉపయోగిస్తారు. అటువంటి ఫ్లయ్ యాష్ తో విజయవాడనుంచి విశాఖ వెళ్తున్న లారీ లో కూలీలు ఎక్కారు. బూడిద మీద టార్పాలిన్ వుంది. టార్పాలిన్ మీద కూలీలు కూర్చున్నారు. లారీడోడ్డు పక్కకి దిగిపోవడాన్ని గమనించి కొందరు దూకేశారు. లారీ ఒక పక్కకి ఒరిగిపోయింది. కూలీల మీద టార్పాలిన్, టార్పాలిన్ మీద బూడిద లుంగచుట్టుకుపోవడమే మరణాలకు కారణమని తప్పించుకున్నవారు వివరించారు.
మృతులు ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు నియోజకవర్గం వారే. ఆయనా , ఉపముఖ్యమంత్రి చినరాజప్ప తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే వారక్కడకు చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి యనమల మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు పూర్తి స్థాయిలో వైద్య చికిత్సలను ఉచితంగానే అందజేస్తామని వెల్లడించారు. ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి హామీనిచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.