సీఎంగా రేవంత్ రెడ్డి, 11 మంది మంత్రులు, స్పీకర్ ప్రమాణ స్వీకారం చేశారు. వంత్ రెడ్డి క్యాబినెట్ లో ఇంకా ఆరు మంత్రి పదవులు కేటాయించాల్సి ఉంది. వీటితోపాలు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, మూడు విప్ పదవులను కేటాయించాల్సి ఉంటుంది. వీటి కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఉంది. ప్రస్తుతానికి ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల నుంచి ఎవరికీ చాన్స్ ఇవ్వలేదు. పూర్వ రంగారెడ్డి జిల్లాకు చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ కు స్పీకర్ పోస్టు దక్కినా.. ఆ జిల్లాకు మంత్రి పదవి లభించలేదు.
సామాజిక, భౌగోళిక సమీకరణాల నేపథ్యంలో తమకు మంత్రి పదవి దక్కుతుందని చాలా మంది భావిస్తున్నారు. ఆదిలాబాద్ చెన్నూరు నుంచి గెలిచిన సీనియర్ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఇబ్రహీంపట్నం నుంచి విజయం సాధించిన మల్ రెడ్డి రంగారెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవి రేసులో ఉన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు తన సెగ్మెంట్ ను వదులు కొని నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన షబ్బీర్ అలీ కూడా మంత్రి పదవి రేసులో కొనసాగుతున్నారు.
తనకూ మంత్రి పదవి కావాలని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. కేసీఆర్ ఇంట్లో నాలుగు మంత్రి పదవులు గతంలో ఉన్నాయని.. తమకు రెండు పదవులుంటే తప్పేంటని ఆయన ప్రస్నిస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి మాత్రమే అవకాశం లభించింది. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మధుయాష్కీకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఆయన రాహుల్ గాంధీకి సన్నిహితుడు. ముషీరాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన అంజన్ కుమార్ యాదవ్, ఆలేరు నుంచి గెలిచిన బీర్ల ఐలయ్య మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు సమాచారం. షాద్ నగర్ నుంచి ఎన్నికైన ఈర్లపల్లి శంకరయ్య రజక సామాజిక వర్గానికి చెందిన వారు ఆయనకు ఏదో ఒక పదవి కట్టబెట్టే చాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది.
సహజంగానే కాంగ్రెస్ మార్కా రాజకీయాల్లో ఇవాళ కాకపోతే రేపైనా అవకాశం వస్తుందని నమ్మించడానికి రెండు, మూడు మంత్రి పదవుల్ని ఖాళీగా ఉంచుకుంటారు. ఎవరైనా అసంతృప్తి గురైతే ఆ ఖాళీల్ని ఆశగా చూపిస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి కూడా అలాంటి రాజకీయం చేస్తారా లేకపోతే అన్నీ .. భర్తీ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.