ఈ దసరాకి సినిమా థియేటర్ల వద్ద కావల్సినంత హంగామా కనిపించింది. దసరాకి ముందే ఎన్టీఆర్ సందడి చేస్తే, సరిగ్గా దసరా సీజన్లో స్పైడర్ వచ్చింది. ఆ తరవాత శర్వానంద్ దిగిపోయాడు. మొత్తానికి సినిమాల పరంగా లోటు లేదు. కాకపోతే టాకులు, వసూళ్లు అంత ఆశాజనకంగా కనిపించలేదు. ఎన్టీఆర్ లవకుశ, మహేష్ స్పైడర్ సినిమాల్లో లోపాలు కనిపించాయి. ఖర్చు పెట్టిన దానికీ, వస్తున్న వసూళ్లకు పొంతన లేదు. సినిమాల్ని ముందుగా అమ్ముకొన్న నిర్మాతలు సేఫ్ జోన్లో పడినప్పటికీ, భారీ రేట్లకు కొనుగోలు చేసిన బయ్యర్లకు చుక్కలు కనిపించాయి. యునానిమస్‌గా ఆకట్టుకోవడంలో స్టార్ హీరోలు ఇద్దరూ విఫలమయ్యారు. రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ దక్కించుకొన్నప్పటికీ – అసలు రాబట్టడంలో ఆమడ దూరంలో నిలిచిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ దశలో దసరా విజేత.. శర్వానంద్ అనే చెప్పుకోవాలి. ఈ సినిమా రూ.10 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కింది. శాటిలైట్ ద్వారా సగం వచ్చేసింది. తొలి రెండు రోజుల్లో మిగిలింది రాబట్టుకొంది టీమ్. ఇప్పుడు దక్కేవన్నీ లాభాలే. తొలి వారాంతంలోనే ఖర్చు రాబట్టుకొందంటే… అంతకంటే కావల్సింది ఏముంది..? స్టార్ డమ్ ల్ని, ఓపెనింగ్స్‌ని పక్కన పెట్టి, ‘ఖర్చు – రాబడి’ అనే విషయాల్ని మాత్రమే బేరీజు వేసుకోగలిగితే… ఈ దసరా విజేత శర్వానంద్ అనే చెప్పుకోవాలి.