సమయం.. సినిమా రీల్లా గిర్రున తిరుగుతుంది. అలా.. చూస్తుండగానే 2022 చివరి వారంలోకి వచ్చేసింది. ఈ యేడాది వచ్చిన చిత్రాల్లో ఆల్ టైం రికార్డ్ వుంది… చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాలు సాధించిన సినిమాలూ వున్నాయి.. అంచనాలు లేకుండా సంచలనాలు సృష్టించిన చిత్రాలూ వున్నాయి… ఓసారి వివరాల్లోకి వెళితే..
‘ఆర్ఆర్ఆర్’ ఆల్ టైం రికార్డ్: రామ్‌చరణ్-తారక్ కాంబినేషన్లో తెరకెక్కిన విజువల్ వండర్ ‘ఆర్ఆర్ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. ఇండియన్ సినిమాలో హయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టుకున్న సినిమాగా ‘ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటింది. జపాన్‌లో తక్కువ సమయంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ మూవీ 17 రోజుల్లో పది కోట్ల రూపాలకుపైగా కలెక్షన్స్ సాధించింది. రజనీకాంత్ ‘ముత్తు’ పేరిట వున్న రికార్డ్ ని బ్రేక్ చేసింది. జపాన్ తో పాటు అమెరికా, చైనా లాంటి మిగతా దేశంలో కూడా ఆర్ఆర్ఆర్ హవా నడిచింది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ చిత్రం దాదాపు మూడు వారాల పాటు టాప్ ట్రెండింగ్ లో కొనసాగింది. యాక్షన్ సన్నివేశాలు, నాటు నాటు పాట పాశ్చాత్య ప్రేక్షకులని కూడా మెస్మరైజ్ చేశాయి. ఆర్ఆర్ఆర్ కి అవార్డుల పంట కూడా పండింది. ఇప్పటికే చాలా విదేశీ అవార్డులు సొంతం చేసుకుంది. అలాగే ఆస్కార్ బరిలో కూడా నిలిచింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరి పోటీపడే పాటల జాబితాలో ‘నాటు నాటు’ పాటను ఎంపిక చేశారు.
ఎఫ్-3: ఈ వేసవిలో థియేటర్లలో నవ్వులు కురిపించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఎఫ్-3’. అనిల్ రావిపూడి దర్శకుడు. మూడేళ్ల క్రితం వచ్చిన ‘ఎఫ్-2’ చిత్రానికి ఫ్రాంచైజీగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఎఫ్-2 కంటే నవ్వుల మోతాదు తక్కువగా వుందని విమర్శకులు అభిప్రాయపడినప్పటికీ బాక్సాఫీస్ వద్ద గట్టిగానే నిలబడింది. వెంకటేష్, వరుణ్ తేజ్ ల ఫన్ ప్రేక్షకులకు నచ్చింది. చాలా రోజుల మంచి కామెడీ సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులు ఎఫ్-3కి బాగానే కనెక్ట్ అయ్యారు. సమ్మర్ సోగ్గాళ్ళు వందకోట్లపైనే గ్రాస్ కలెక్ట్ చేశారని ట్రేడ్ వర్గాలు లెక్కకట్టారు.
సీతారామం: ఓ సాధారణ చిత్రంగా విడుదలై ప్రేక్షకుల మదిని కన్నీటితో బరువెక్కించిన ప్రేమ కావ్యంగా నిలిచింది సీతారామం. సీతా, రామ్‌గా మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ కెమిస్ట్రీ ప్రేక్షకులని కట్టిపడేసింది. దర్శకుడు హనురాఘవపూడి సినిమాని అందమైన పెయింట్ గా మలిచాడు. ప్రేక్షకుడికి ఒక మధురమైన దృశ్యకావ్యం చూపిన అనుభూతిని కలిగించాడు. పాటలు మనసుని హత్తుకున్నాయి. రూ.30 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.80 కోట్లు వసూళ్లు చేసిందని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. గీతాంజలి, మరో చరిత్రలాంటి ప్రేమ కథని నిర్మించాలానేది నిర్మాత అశ్వినీదత్ చిరకాల కోరిక. ఆ కోరిక సీతారామంతో తీరిపోయింది.
నిఖిల్ కి రెండు హిట్లు : 2022 నిఖిల్ కి బ్లాక్ బస్టర్ ఇయర్. పెద్ద అంచనాలు లేకుండా వచ్చిన కార్తికేయ 2 పాన్ ఇండియా విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా వైజ్ 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా విజయం అనూహ్యం. కృష్ణుడు, ద్వారకానగరం చుట్టూ కథను అల్లుకోవడం, ఉత్తరాదిలో కృష్ణుడి ఆరాధన ఎక్కువ గా వుండటం, ఈ కంటెంట్ వారికీ కనెక్ట్ కావడంతో ఊహించిన విధంగా సినిమా ఆడింది. అనుపమ్‌ఖేర్‌లాంటి నటులు కూడా ఉండటం అదనపు ఆకర్షణ తెచ్చింది. కేవలం హిందీలోనే 40 కోట్ల వరకు వసూలు చేసి నిఖిల్ కెరీర్ బెస్ట్ గా నిలిచింది. ఈ యేడాది మరో హిట్ తో ముగించాడు నిఖిల్. సుకుమార్ కథతో వచ్చిన 18 పేజస్ కి హిట్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ బావున్నాయి. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ కంటెంట్ కనెక్ట్ అయ్యింది. ఫీల్ గుడ్ ప్రేమ కథని యువత ఎంజాయ్ చేస్తుంది. 18 పేజస్ రూపంలో నిఖిల్ ఖాతాలో మరో హిట్ పడింది.
అడివి శేష్ అదరగొట్టాడు: అడివి శేష్ ఈ యేడాది పాన్ ఇండియాకి పరిచయం అయ్యాడు. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా శేష్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘మేజర్’ ప్రేక్షకులని మెప్పించింది. మేజర్ ని అత్యున్నత స్థాయిలో తెరకెక్కించారు. శేష్ నటనకు మంచి పేరొచ్చింది. బాక్సాఫీసు వద్ద సత్తా చాటింది మేజర్. అలాగే హిట్ 2 రూపంలో శేష్ ఖాతాలో మరో విజయం చేరింది. శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ 2 కి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. నిర్మాత నాని లాభాల బాట పట్టారు. హిట్ 2 విజయం హిట్ ఫ్రాంచైజ్ పై మరింత ఆసక్తిని కలిగించింది.
డిజె టిల్లు:చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది డిజె టిల్లు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా యూత్ కి తెగ నచ్చేసింది. టిల్లు క్యారెక్టర్, రాధిక, పాటలు, డైలాగులు అన్నీ వైరల్ అయ్యాయి. బాక్సాఫీసు వద్ద డిజె సౌండ్ గట్టిగానే వినిపించింది. నిర్మాతలకు మూడింతలు లాభాలు తీసుకొచ్చింది. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు.
ఒకే ఒక జీవితం: ఆడవాళ్లు మీకు జోహార్లు ఫలితంతో నిరాశపడ్డ శర్వానంద్ కి ఒకే ఒక జీవితం ఉత్సాహాన్ని ఇచ్చింది. మనసుని హత్తుకునే భావోద్వేగాలు మధురానుభావాల ప్రయాణంగా ప్రేక్షకులని మెప్పించింది. టైం మిషన్ తరహా కథతో ఆకట్టుకునే కథనంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు శ్రీకార్తి. విమర్శకుల ప్రశంసలతో పాటు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది ఒకే ఒక జీవితం.
బింబిసార :థియేటర్ ఎక్స్ పీరియన్స్ వుండే కంటెంట్ ఇవ్వాలే కానీ ప్రేక్షకులు ఆదరణకు కొరతలేదని నిరూపించిన సినిమా బింబిసార. పటాస్ తర్వాత విజయం కోసం ఎంతగానో ఎదురుచూసిన కళ్యాణ్ రామ్ కి బింబిసార ఫలితం కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. పిరియాడిక్ టైమ్ ట్రావెల్ నేపధ్యంలో చరిత్రని వర్తమాన్ని కలిపిన బింబిసారుడి ప్రయాణం ప్రేక్షకులని మెప్పించింది. నిర్మాతగా కళ్యాణ్ రామ్ లాభాలు చూశారు. ఇప్పుడు మరిన్ని హంగులతో బింబిసార2 రూపొందుతోంది.
మసూద: హారర్ సినిమా బాక్సాఫీసు విజయం సాధించి చాలా కాలమైయింది. ఈ యేడాది మసూద ఈ లోటుని భర్తీ చేసింది. ప్రేక్షకులు భయం రుచి చూపించింది. మితిమీరిన హింస వుందనే విమర్శ వచ్చినప్పటికీ చాలా కాలం తర్వాత అత్యధికంగా ప్రేక్షకులు థియేటర్ లో చూసిన సినిమాగా నిలిచింది. బడ్జెట్ లో సినిమాని నిర్మించడంతో నిర్మాతకు రెండితలు లాభం తెచ్చిపెట్టింది.