ఏ రంగంలో ఉన్నవారికైనా ప్రతీ యేడాదీ కీలకమే. ప్రతీ రోజూ ముఖ్యమే. కానీ – తమని తాము నిరూపించుకోవడానికంటూ ఓ రోజు ఉంటుంది. ”ఇప్పుడు కాకపోతే… ఇంకెప్పుడు?” అనే స్థితి వస్తుంది. పవన్ కల్యాణ్ విషయంలో అది ఈ యేడాదే.
2024 పవన్ కెరీర్లో చాలా కీలకమైన యేడాది. అటు రాజకీయపరంగా, ఇటు సినిమాల విషయంలో. ఈ యేడాదే ఏపీ ఎన్నికలు రాబోతున్నాయి. జనసేన పార్టీ స్థాపించి, ప్రతి కూల పరిస్థితుల్లో పదేళ్లు లాక్కొచ్చాడు పవన్. మరో ఐదేళ్లు ఆ పార్టీ నిలబడాలంటే ఈసారి ఎన్నికల్లో కనీస సీట్లు సంపాదించాలి. తాను ఎం.ఎల్.ఏగా గెలవాలి. మిత్రపక్షం టీడీపీని గెలిపించాలి. అధికారంలోకి వచ్చినా, రాకపోయినా తన ప్రభావం ఏమిటన్నది చూపించాలి. 2019 ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయినప్పుడు, ఒకే ఒక్క ఎం.ఎల్.ఏ గెలిచినప్పుడు, ఆ గెలిచిన ఎం.ఏల్.ఏ కూడా పార్టీ మార్చినప్పుడు జనసేన పని అయిపోతుందనుకొన్నారంతా. కానీ పట్టుదలతో పార్టీని కాపాడుకొన్నాడు. వైకాపా నుంచి వలసలు పెరగడం వల్ల ఆ పార్టీకో బలం, రూపూ వచ్చాయి. పదేళ్ల పాటు పార్టీని నిలబెట్టుకోవడం, జనం మధ్య ఉండడంతో పవన్‌పై సానుభూతి కూడా పెరిగింది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో పవన్ పాత్ర క్రీయాశీలకం కానుంది. పవన్‌ని ఈసారైనా అభిమానులు గెలిపించుకొంటారా, లేదా మరోసారి పవన్‌కి మొండి చేయి చూపిస్తారా? అనేది కాలమే నిర్ణయిస్తుంది.
2023 సినిమాల పరంగా పవన్‌కి పెద్దగా కలిసి రాలేదు. ‘బ్రో’ సినిమా బిలో యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. ‘హరి హర వీరమల్లు’ ప్రాజెక్ట్ కు బ్రేకులు పడ్డాయి. రాజకీయ సమీకరణాలతో బజీగా ఉండడం వల్ల సినిమాలకు తగినంత సమయం కేటాయించలేకపోయడు. 2024 ఎన్నికలు అయిపోయిన తరవాత పవన్ పూర్తి స్థాయిలో సినిమాలకు అందుబాటులో ఉంటాడు. ‘ఓజీ’పై అభిమానులకు గట్టి నమ్మకాలున్నాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై కూడా ఆశలు పెట్టుకొన్నారు. ఆగిపోయిన ‘హరి హర వీరమల్లు’ మళ్లీ మొదలెట్టాలి. ఆ తరవాత సురేందర్ రెడ్డి సినిమా కూడా పట్టాలెక్కించాలి. 2024లో ఓజీ వస్తుంది. ఉస్తాద్ కూడా రావొచ్చు. హీరోగా తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకోవాలంటే కనీసం ఒక్క సినిమా బాక్సాఫీసు దగ్గర దుమ్ము రేపాలి. అలా.. సినిమాల పరంగానూ పవన్ కు 2024 చాలా కీలకం.