స్టార్ల సినిమా హిట్టు కొట్టినా – ఫ్లాపు అయినా పెద్దగా ఫరక్ పడదు. వాళ్ల కెరీర్లు వాళ్లకుంటాయి. అదే ఓ చిన్న సినిమా హిట్టైతే – పరిశ్రమ కళకళలాడిపోతుంది. అలాంటి చిన్న సినిమాలు వంద పుడతాయి. చిన్న హీరోతో తీసిన సినిమా సూపర్ హిట్, బ్లాక్ బ్లస్టర్, క్లాసిక్ అయితే.. ఇక తిరుగేముంది? ఇండ్రస్ట్రీకి పునరుత్తేజం వచ్చినట్టే. అలా.. చిత్రసీమని ఓ ఊపు ఊపిన సినిమా… `పెళ్లి సందడి`.
బడా హీరోలతో రాఘవేంద్రరావు ఎన్నో సూపర్ హిట్లు తీశారు. మర్చిపోలేని సినిమాలెన్నో ఆయన ఖాతాలో ఉన్నాయి. అయితే వాటన్నింటిలోనూ…`పెళ్లి సందడి` చాలా ప్రత్యేకం. శ్రీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. అశ్వనీదత్, అల్లు అరవింద్ లాంటి దిగ్గజ నిర్మాతలు కలిసి చేసిన సినిమా ఇది. నేటికి ఈ సినిమా విడుదలై.. సరిగ్గా పాతికేళ్లు.
అచ్చమైన, స్వచ్ఛమైన.. రాఘవేంద్రరావు మార్క్ ఏమిటో ఈ సినిమాలో కనిపిస్తుంది. కలలోకొచ్చిన బొడ్డు సుందరి కోసం అన్వేషిస్తున్న ఓ అబ్బాయి… అనుకోకుండా ఇంట్లో కుదిర్చిన సంబంధానికి ఓకే అంటాడు. సడన్ గా.. తన బొడ్డు సుందరి కనిపిస్తుంది. ఆ తరవాత.. ఏమైందన్నది కథ. కథలో కంటే.. కథనంలో మ్యాజిక్ చేశాడు దర్శకేంద్రుడు. పాటలైతే.. సూపర్ డూపర్ హిట్టు… మా పెరటి జాం చెట్టు పళ్లన్నీ… అయితే… ఎప్పటికీ.. ఎవర్ గ్రీన్. సౌందర్య లహరి, తకథిమి తకథిమి తాళం, రమ్యకృష్ణ లాగ ఉంటదా… ఇలా ప్రతీ పాటా. ఆణిముత్యమే.
పెళ్లింట ఎంత సందడి ఉంటుందో.. ఈ సినిమా మొత్తం అదే సందడి కనిపిస్తుంటుంది. `కాపీలు తాగారా.. టిపినీలు తిన్నారా`.. ట్రాకైతే.. తెలుగువాళ్లందరికీ నచ్చింది. అది ఇప్పటికీ ఊతపదమైపోయింది. శ్రీకాంత్ కెరీర్‌కి రెడ్ కార్పెట్ వేసిన సినిమా ఇది. `పెళ్లి సందడి` తరవాత.. రాఘవేంద్రరావు ఎన్నో సూపర్ హిట్లు తీశారు. కానీ.. `పెళ్లి సందడి` రేంజు రాలేదన్నది నిజం. ఇప్పుడు పాతికేళ్ల తరవాత.. `పెళ్లి సందడి`కి సీక్వెల్ తీస్తున్నారాయన. ఇందులో శ్రీకాంత్ తనయుడు హీరోగా నటిస్తుండడం విశేషం. పాతికేళ్ల తరవాత దర్శకేంద్రుడు ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తారేమో చూడాలి.