భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇతర పార్టీలను ఎంత అప్రజాస్వామికంగా.. అణచివేయాలో అన్నీ చేసింది. ముఖ్యంగా పార్టీలకు ఆర్థిక సహకారం అందకుండా.. విరాళాల్ని నియంత్రించింది. ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని తెచ్చింది. దాంతో బ్లాక్ మనీ అంతా బీజేపీ ఖాతాలోకి వెళ్తోంది. ఇప్పుడు పార్టీలకు అందుతున్న విరాళాల్లో 80 నుంచి 90 శాతం బీజేపీకి మాత్రమే అందుతున్నాయి. మిగతా మొత్తాన్ని ఇతర పార్టీలు పంచుకుంటున్నాయి. అలా వస్తున్న డబ్బుతో బీజేపీ విచ్చలవిడిగా వ్యవహరిస్తోంది. దానికి సాక్ష్యమే ఈ ఎన్నికల్లో 272 హెలికాఫ్టర్లను ఉపయోగించడం. ..!
90 శాతం హెలికాఫ్టర్లను బుక్ చేసుకున్న బీజేపీ..!
దేశంలో ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. సమరం మొదలవ్వడంతో… ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీలు హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంటున్నాయి. ప్రచారంలో సూదుర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రధాన పార్టీల నేతలు హెలికాప్టర్లను వాడుతున్నారు. అయితే దేశంలో ఉన్న హెలికాప్టర్లలో 90 శాతం బీజేపీ బుక్ చేసుకుంది. ఇతర పార్టీలకు అవకాశం లేకుండా మెజార్టీ హెలికాప్టర్లు.. బీజేపీ నేతలకు చేరుతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ సుమారు 272 హెలికాప్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు వాడుతోంది. ఇవి దేశంలో ఉన్న హెలికాప్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌ల్లో 90 శాతం. బీజేపీ అగ్రనేతలకే కాదు.. చోటామోటా నాయకులు కూడా ఇపుడు హెలికాప్టర్లలోనే ప్రచారం చేయబోతున్నారు. బీజేపీ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల కంటే వాళ్లు బుక్ చేసుకున్న హెలికాప్టర్ల సంఖ్యే అధికంగా ఉంది.
272 హెలికాఫ్టర్లలో తిరిగితే 272 సీట్లు వస్తాయా..?
ప్రధాని నరేంద్రమోదీకి భద్రతా కారణాల రీత్యా.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్‌ను ఉపయోగిస్తున్నారు. దీనికి ఈసీ అనుమతి ఉంది. అయితే కేంద్రమంత్రులు, ఇతర నేతలు ఎవ్వరూ ప్రభుత్వ హెలికాప్టర్లు వాడేందుకు అనుమతి లేదు. దీంతో బీజేపీ కేంద్రమంత్రులకు, సీనియర్ నాయకులకు… భారీగా హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంది బీజేపీ. అమిత్ షాకు 11 సీటర్ హెలికాప్టర్‌ను రెంట్‌కు తీసుకున్నట్లు తెలుస్తోంది. పలువురు కేంద్రమంత్రులు కూడా డబల్ ఇంజిన్ హెలికాప్టర్లలో ప్రచారానికి వెళ్తున్నారు. అయితే చాపర్లన్నింటినీ.. బీజేపీ ముందుగానే బుక్ చేసుకోవడంతో ఇతర పార్టీలకు హెలికాప్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు దొరకడం గగనంగా మారింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తోన్న బీజేపీ… అందుకోసం ఎంత ఖర్చుకైనా వెనకాడటం లేదన్నది ఈ విషయం స్పష్టంగా చెబుతోంది. ఆఖరికి ద్వితీయ శ్రేణి నాయకులకు కూడా హెలికాప్టర్లను అందుబాటులో ఉంచుతోంది బీజేపీ.
అవినీతి సొమ్ము విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారా..?
ఇపుడు బీజేపీకి ఇంత సొమ్ము ఎక్కడిదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక్క హెలికాప్టర్ ఖర్చు మాములుగా ఉండదు. సాధారణ సమయంలోనే చాపర్లను వాడాలంటే తడిసిమోపేడు అవుతుంది. మాములు టైమ్‌లో గంటకు 2 నుంచి రెండున్నర లక్షలు అద్దె ఉండగా.. ఎన్నికల సమయం కావడంతో రేటును మరింత పెంచేశాయి. డిమాండ్‌కు తగ్గట్టుగా భారీ అద్దెలు పెంచేశాయి కంపెనీలు. ఇపుడు గంటకు నాలుగు లక్షలపైనే హెలికాప్టర్ అద్దె ఉంది. ఇందులో డబుల్ ఇంజిన్, 11 సీటర్లకు వేరే మరింత అదనం..! ఇక ఎయిర్‌క్రాఫ్ట్, చార్టెడ్ ప్లేన్లకు కూడా భారీగా ఖర్చు అవుతుంది. మరి ఇంత సొమ్ము బీజేపీకి ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నిస్తున్నాయి.