స్టార్ హీరోల సిన్మాలకు, భారీ బడ్జెట్ సిన్మాలకు లీకుల బెడద తప్పేట్టు కనిపించడం లేదు. అప్పట్లో తెలుగు సినిమా ‘అత్తారింటికి దారేది’ విడుదలకు ముందు సినిమా పైరసీ ప్రింట్ వచ్చేయడం సంచలనం. అంతకు ముందు ఆ తర్వాత పలు సినిమాలు పైరసీ బారిన పడ్డాయి. షూటింగ్ స్టేజి నుంచి లీకులు, పైరసీ సమస్యల ఎదురు కాకూడదని ఎక్స్ట్రా కేర్ తీసుకున్న ‘బాహుబలి’కి కూడా లీకుల బెడద తప్పలేదు. మొన్నటికి మొన్న ‘జై లవకుశ’ సినిమాలో జై క్యారెక్టర్ టీజర్ లీక్ అయ్యింది. ఈ జాబితాలో రజనీకాంత్ సినిమా వంతు ఇప్పుడు వచ్చింది. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సిన్మా ‘2.0’. ఎప్పుడో విడుదల కావలసిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వెనక్కి వెళ్తోంది. దాంతో టీజర్ విడుదల కార్యక్రమాన్ని కూడా వాయిదా వేశారు. కానీ, ఏం లాభం? ఇంటర్నెట్లో టీజర్ వచ్చేసింది. ఎవరో లీక్ చేశారు. వున్నట్టుండి అందరి చేతుల్లో సెల్ ఫోన్లు గాల్లో ఎగిరి ఒక చోటు చేరడం, అందులోంచి అక్షయ్ కుమార్ ఎంట్రీ… ‘రోబో’లో ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసిన చిట్టి రోబో రీ ఎంట్రీ… చివర్లో రజనీకాంత్ ‘హో హో’ డైలాగ్ చెప్పడం సినిమాపై క్యూరియాసిటీ కలిగిస్తున్నాయి. బహుశా… గ్రాఫిక్ వర్క్ చేశాక ఎలా వచ్చిందో చూడడం కోసం ప్రదర్శించిన సమయంలో ఎవరో ఫోనులో రికార్డ్ చేసినట్టు వున్నారు. ఇప్పుడీ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్లో షేర్లు, పోస్టులు, ట్వీట్లు కొడుతున్నారు. దీనిపై ‘2.0’ యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో?