చంద్రబాబునాయుడు తొలి సారి ముఖ్యమంత్రిగా మూడు దశాబ్దాల కిందట సెప్టెంబర్ ఒకటో తేదీనే ప్రమాణం చేశారు. కొత్త తరానికి అంటే ముఫ్పై ఏళ్ల లోపు ఉన్న వారికి ఆయన పాలన ప్రత్యక్షంగా చూసిన అనుభవం తక్కువే. మొదటి పదేళ్లు ఆయన పాలన చూసిన వారు… ఆయనకు ఫ్యాన్స్ కాకుండా ఉండలేరు. అది ఆయనను అరెస్టు చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కనిపించింది.
రాజకీయాలంటే కుట్రలు, కుతంత్రాలు.. దయ, నిర్దయ అనేవి లేకపోవడం కాదు… ప్రజల కోసం …రాష్ట్రం కోసం.. అభివృద్ధి కోసం అని నమ్మిన మొదటి లీడర్ చంద్రబాబు. ఆయన పాలన చేపట్టిన మరుక్షణం నుంచి రాజకీయంగా ఎంత లాభం అని లెక్కలేసుకోకుండా నిర్ణయాలు తీసుకున్నారు. పాలనలో ప్రజల్ని భాగస్వామ్యం చేశారు. కుల, మతాలకు అతీతంగా అందరూ ఆర్థికంగా ఎదగాలని తాపత్రయపడ్డారు. చంద్రబాబు సీఎం అయినప్పుడు హైదరాబాద్ అంటే.. టూరిజం ప్లేస్.. లుంబిని పార్క్ ల్లాంటివి చూసొద్దామనుకుని హైదరాబాద్ వెళ్లేవాళ్లు ఎక్కువ. నగరంలో ఏ మూల చూసినా ఉర్దూ తప్ప ..తెలుగు వినిపించేది అంతంతమాత్రం. అలాంటి హైదరాబాద్‌ను ఉపాధి కేంద్రంగా మార్చేశారు. తెలుగువారి భాగ్యనగరం చేశారు. ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద నగరాల్లో ఒకటి.
విద్యుత్ సంస్కరణలు అమలు చేశారు. దాని వల్ల ఎంతో మేలు జరిగింది. కానీ చంద్రబాబు నష్టపోయారు. అయినా తగ్గలేదు. మొదటి రెండు దశల సీఎం స్వర్ణయుగం. ఆ తర్వాత పదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఉండాల్సి వచ్చింది. ఆయన సీఎంగా లేకపోవడంతో విభజన వాదం వచ్చింది. రాష్ట్రం విడిపోయింది. విభజన ఏపీకి సీఎం అయ్యారు. కానీ అక్కడా అదే అభివృద్ధి రాజకీయం దెబ్బకొట్టింది. ఇప్పుడు నాలుగోసారి సీఎం అయ్యారు. ముఫ్పై ఏళ్లలో పదిహేనేళ్లు సీఎం.. పదిహేనేళ్లు ప్రతిపక్ష నేత. కానీ ఆయన దారి మాత్రం.. ఒక్కటే అభివృద్ధి రాజకీయాలు.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే.. అభివృద్ధిపై చర్చ జరుగుతోంది. అంతా ఒక వైపు అభివృద్ధి చేస్తున్నారని.. కొంత మందిని పైకి తీసుకెళ్లిపోతున్నారని ప్రచారం చేస్తారు. దాని వల్ల మెజార్టీ వర్గాల్లో వ్యతిరేకత పెంచుతారు. అాలా ప్రచారం చేసి గెలిచేవారి పాలనలో అభివృద్ధి అనే మాట వినిపించదు. అందర్నీ నేల నాకించేస్తారు. మళ్లీ చంద్రబాబుకే రావాలని ప్రజలు ఓట్లేస్తారు. నిజానికి చంద్రబాబు విజయన్ 2020 పెట్టుకున్నారు. నిరంతరాయంగా ఆయన సీఎంగా ఉండి ఉంటే… తెలుగు రాష్ట్రాల ఆర్థిక భవిష్యత్, అభివృద్ధి ని ఊహించడం కష్టమే. అందుకే ఆయన సీఎంగా ప్రమాణం చేసిన రోజును అభివృద్ధి రాజకీయాల పుట్టిన రోజుగా పేర్కొనవచ్చు.