బుల్లి తెరపై ఎన్టీఆర్ రంగ ప్రవేశం ఖాయమైంది. స్టార్ మాలో ఇక నుంచి ఎన్టీఆర్ కూడా కనిపించబోతున్నాడు. బిగ్ బాస్ షో తో మురిపించబోతున్నాడు. ఎన్టీఆర్ ఒప్పుకోవడంతో బిగ్ బాస్‌కి కొత్త కళ వచ్చినట్టే. ఈ రియాలిటీ షోని గ్రాండ్‌గా తెరకెక్కించడానికి మా అన్ని సన్నాహాలూ పూర్తి చేసేసింది. ఎన్టీఆర్ షో కదా.. కాస్త కాస్ట్లీగా ఉండడంలో తప్పు లేదు. అందుకే ఏకంగా రూ.45 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తోంది. ఓ టీవీ షోకి ఈ స్థాయిలో బడ్జెట్ కేటాయించడం తెలుగులో ఓ రికార్డ్ అనుకోవాలి. మూడు నెలల పాటు సాగే షో ఇది. జులైలో మొదలై సెప్టెంబరుతో ముగుస్తుంది. ఈ ఒక్క సీజన్ కోసం ఏకంగా రూ.45 కోట్లు ఖర్చు పెట్టడం షాకిచ్చే విషయమే.
ఈ బడ్జెట్ లో సింహభాగం ఎన్టీఆర్ పారితోషికానికి కేటాయించార్ట. ఆ అంకె ఎంతో చెప్పడం లేదు గానీ.. టాలీవుడ్లో మరే సెలబ్రెటీ ఈ స్థాయిలో పారితోషికం అందుకోలేదని మాత్రం ‘బిగ్ బాస్’ నిర్వాహకులు ఓ హింట్ ఇస్తున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు పోగ్రాంతో చిరు అందుకొన్న పారితోషికం కంటే.. ఇది రెట్టింపు ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది. శని, ఆదివారాల్లో ‘మా స్టార్’లో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. దాదాపుగా లైవ్ లో చూసినట్టే. షూట్ చేసిన ఓ గంటకే ఈ కార్యక్రమాన్ని టెలీకాస్ట్ చేస్తార్ట. సినీ, క్రికెట్, రాజకీయ రంగాల నుంచి కొంతమంది ప్రముఖులు ఈ రియాలిటీ షోలో పాలు పంచుకొంటారు. బిగ్ బాస్ విజేతకూ ప్రైజ్ మనీ భారీ స్థాయిలోనే ఉండబోతోంది. ఎన్టీఆర్ రాకతో.. టీవీ రంగానికి ఓ కొత్త కళ వచ్చేసిందిప్పుడు. ఎన్టీఆర్ క్రేజ్ బిగ్ బాస్‌కి ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూడాలి.