నరేంద్రమోడి 2014 మే 26నుంచి భారతదేశ ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు. దానికిముందు ఆయన దాదాపు 13 సంవత్సరాలు – 2001నుంచి 2014వరకు గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1950సెప్టెంబర్ 17న గుజరాత్ రాష్ట్రంలోని మెహ్సానాజిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో జన్మించిన మోడి, టీ అమ్ముకునే ‘చాయ్ వాలా’గా జీవితాన్ని ప్రారంభించారు. 1987లో భారతీయ జనతాపార్టీలో ప్రవేశించారు. అక్కడినుంచి అంచెలంచెలుగా ఎదిగి 1998లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
గుజరాత్ లో 2001లో జరిగిన ఉపఎన్నికలలో భారతీయజనతాపార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ నాటి ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ రాజీనామా చేయటంతో నరేంద్రమోడికి సీఎమ్ పీఠం దక్కింది. నాటినుంచి ఆయనకు తిరుగులేకుండా పోయింది. ఆ తర్వాత 2002లో, 2007లో, 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించటంలో మోడిపాత్ర కీలకం కావటంతో ఆయనే వరసగా ముఖ్యమంత్రిగా కొనసాగారు. గుజరాత్ రాష్ట్రాన్ని అన్నిరంగాలలో అభివృద్ధిచేసి అగ్రస్థానంలో నిలబట్టారని పేరుగడించినప్పటికీ, 2002సంవత్సరంలో జరిగిన గోధ్రా మారణకాండ, తదనంతరం జరిగిన మతకలహాలకు మోడియే కారణమని తీవ్ర ఆరోపణలు వాడుకలో ఉన్నాయి. ఇదే ఆరోపణలపై అమెరికా ప్రభుత్వం మోడికి, ఆయన ప్రధానిగా ఎన్నికయ్యేవరకు వీసాను నిరాకరించింది. వరసగా మూడుసార్లు గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ విజయానికి ప్రధాన కారకుడవటంతో మోడీయే ఆ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదనలు మొదలయ్యాయి. అద్వానీవంటివారు కొంతమంది వ్యతిరేకించినప్పటికీ చివరికి 2014 సాధారణ ఎన్నికలముందు మోడీనే బీజేపీ నాయకత్వం ప్రధాని అభ్యర్థిగా ఎంపికచేసింది. 2014 ఎన్నికలలో బీజేపీ అఖండ విజయానికి మోడి నాయకత్వంకూడా ఒక కారణమని చెప్పుకోవాలి. మోడి స్వయంగా గుజరాత్ లోని వదోదరానుంచి, వారణాసినుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 మే 26న భారతదేశ 15వ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
మోడికి నలుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. జసోదా బెన్ ను వివాహం చేసుకున్నప్పటికీ మోడికి, ఆమెకు మధ్య సంబంధాలు లేవు.