ప్రముఖ తెలుగు నటుడు నందమూరి బాలకృష్ణ దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటుడు ఎన్.టి.రామారావు నాలుగో కుమారుడు. 1960 జూన్ 10న మద్రాస్‌లో జన్మించారు. ఆయన ప్రాధమిక విద్య అక్కడే జరగగా, కళాశాల విద్య మాత్రం హైదరాబాద్‌లోని నిజాంకళాశాలలో సాగింది. 14 ఏళ్ళ వయసులోనే చలనచిత్రరంగంలో ప్రవేశించి తాతమ్మకల, రామ్ రహీమ్, అన్నదమ్ముల అనుబంధం, వేములవాడ భీమకవి, దానవీరశూరకర్ణ వంటి చిత్రాలద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1982లో వసుంధరతో వివాహం జరిగింది. తండ్రి రామారావు రాజకీయాలలో ప్రవేశించటంతో ఆయన స్థానాన్ని భర్తీ చేయటంకోసం 1984లో సాహసమే జీవితం సినిమాతో పూర్తిస్థాయిలో చలనచిత్రరంగ ప్రవేశం చేశారు. అదే సంవత్సరం విడుదలైన మంగమ్మగారి మనవడు బాలకృష్ణకు బ్రేక్‌నిచ్చింది. దాంతో తెలుగులో అగ్రస్థాయినటులలో ఒకరుగా మారిపోయారు. 1986లో ముద్దుల క్రిష్ణయ్య, సీతారామ కళ్యాణం, అనసూయమ్మగారి అల్లుడు, దేశోద్ధారకుడు, కలియుగ కృష్ణుడువంటి వరుస సూపర్ హిట్ చిత్రాలతో సక్సెస్ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.
భైరవద్వీపంవంటి జానపదచిత్రం, శ్రీష్ణార్జున విజయంవంటి పౌరాణికచిత్రం, ఆదిత్య369వంటి చారిత్రక సైన్స్ ఫిక్షన్ చిత్రంలోనూ నటించి అలాంటి చిత్రాలలో నటించగల ఏకైక నటుడు బాలయ్యేనని పేరు గడించారు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా, లెజెండ్ వంటి చిత్రాలు అత్యంత ప్రజాదరణ పొంది ఎన్నో రికార్డులు సృష్టించాయి. ప్రస్తుతం 99వ చిత్రం డిక్టేటర్లో నటిస్తున్న బాలయ్య, ప్రతిష్ఠాత్మక వందో చిత్రం దర్శకత్వం అవకాశాన్ని బోయపాటి శ్రీనుకు ఇచ్చారు.
బాలకృష్ణ, వసుంధర దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్దకుమార్తె బ్రాహ్మణిని సోదరి భువనేశ్వరి, బావ చంద్రబాబునాయుడుల కుమారుడు లోకేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. రెండో కుమార్తె తేజస్విని వివాహం విశాఖపట్నంలోని గీతం విద్యాసంస్థల యాజమాన్యంవారి వారసుడు భరత్‌తో జరిగింది. కుమారుడు మోక్షజ్ఞ ప్రస్తుతం చదువుకుంటున్నారు. త్వరలో అతను చలనచిత్రరంగ ప్రవేశం చేస్తాడని బాలయ్య ప్రకటించారు. 2004లో బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పులలో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్, జ్యోతిష్కుడు సత్యనారాయణ చౌదరి తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆ కేసు తర్వాత కాలంలో కోర్టులో వీగిపోయింది. తన తల్లి బసవతారకంపేరుతో హైదరాబాద్‌లో ఏర్పాటయిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌కు బాలయ్య ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో అనంతపూర్ జిల్లా హిందూపూర్ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.