తెలుగు నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ తన అన్నమెగాస్టార్ చిరంజీవి అండతో టాలీవుడ్లో ప్రవేశించారు. అయితే అతి త్వరగానే తనదైన ముద్రతో ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్నారు. 1996లో ఆయన మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి విడుదలయింది. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో వెలువడిన ఆ సినిమాలో పవన్ మార్షల్ ఆర్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ ఆ చిత్రంలో హీరోయిన్గా నటించింది. 1998లో విడుదలైన తొలిప్రేమ కళ్యాణ్‌కు మొదటి బ్రేక్‌ను ఇచ్చింది. తర్వాత గోకులంలో సీిత, సుస్వాగతం, తమ్ముడు, బద్రి, ఖుషివంటి వరుస హిట్ చిత్రాలతో అగ్రనటుడిగా మారారు. అయితే 2003లో స్వీయదర్శకత్వంలో తీసిన జానీ నుంచి 2006లో వచ్చిన అన్నవరంవరకు ఏ సినిమాకూడా మంచి విజయాన్ని సాధించలేకపోయింది. 2008లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జల్సా రికార్డులను తిరగరాసింది. కానీ మళ్ళీ నాలుగేళ్ళపాటు ఆయనను ఫ్లాప్‌లు వెంటాడాయి. పులి, తీన్ మార్, పంజా వంటి చిత్రాలు ఘోరంగా పరాజయంపాలయ్యాయి.
2012లో తన అభిమాని, దర్శకుడు హరీష్ శంకర్ తీసిన గబ్బర్ సింగ్‌తో పవన్ పూర్వవైభవాన్ని తిరిగి సంతరించుకున్నారు. ఆ చిత్రం అత్యంత ప్రజాదరణ పొంది రికార్డులను తిరగరాసింది. ఆ తర్వాత పూరిజగన్నాథ్ దర్శకత్వంలో చేసిన కెమేరామేన్ గంగతో రాంబాబు చిత్రం విడుదలయింది. అదికూడా మంచి విజయాన్నే సాధించింది. ఇక 2013లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం తెలుగు చలన చిత్రరంగంలో అత్యధిక వసూళ్ళు చేసిన చిత్రంగా రికార్డ్ సాధించింది. ఈ చిత్రం పైరసీ కాపీలు యూట్యూబ్‌లో విడుదలైనప్పటికీ ఆ ప్రభావం చిత్ర విజయంపై కనిపించలేదు. ఈ చిత్ర విజయంతో పవన్ ప్రజాదరణ తారాస్థాయికి చేరింది. పవన్ పేరును ప్రస్తావించటంద్వారా ప్రచారాన్ని పొందటానికి పలువురు దర్శకనిర్మాతలు ప్రయత్నించటం సర్వసాధారణమైపోయింది. పవన్ ఇటీవల వెంకటేష్ ప్రధాన పాత్రధారిగా వచ్చిన గోపాల, గోపాల చిత్రంలో అతిథి పాత్రలో నటించారు. ఆయన తదుపరి చిత్రం గబ్బర్ సింగ్ 2 షూటింగ్ ఇటీవల పూణే సమీపంలో ప్రారంభమయింది. దీనికి బలుపు దర్శకుడు బాబి దర్శకత్వం వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ 1997లో నందిని అనే ఆమెను వివాహమాడారు. అయితే వారిద్దరికీ పొంతన కుదరక పోవటంతో 2007లో విడాకులు తీసుకున్నారు. తనతో అనేక రోజులుగా సహజీవనం చేస్తున్న ‘బద్రి’ సహనటి రేణూ దేశాయ్‌ను 2009లో వివాహం చేసుకున్నారు. ఆమె ద్వారా అకీరా నందన్, ఆద్య అనే పిల్లలు కలిగారు. కానీ రేణూ దేశాయ్నుంచికూడా విడాకులు తీసుకుని 2014లో అన్నా లెనేవా అనే విదేశీ మహిళను వివాహం చేసుకున్నారు.
2014 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకుముందు పవన్ జనసేన అనే పార్టీని స్థాపించారు. ఈ ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేయబోదని, ప్రశ్నించటానికే పార్టీ పెట్టానని పవన్ ప్రకటించారు. ఎన్నికలసమయంలో భారతీయ జనతాపార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడికి పవన్ మద్దతు తెలిపారు. ఆ ఎన్నికలలో భారతీయ జనతాపార్టీకి, ఆ పార్టీ మిత్రపక్షమైన తెలుగుదేశానికి మద్దతుగా ప్రచార సభలలో పాల్గొన్నారు. పవన్ ప్రచారం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశానికి బాగా కలిసొచ్చి అధికారాన్ని చేపట్టగలిగింది.