ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కె.చంద్రశేఖరరావులకు మానసిక ప్రశాంతత అవసరమని భారతీయ జనతాపార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. ఓటుకు నోటు వ్యవహారంపై వ్యాఖ్యానిస్తూ ఇరువురు ముఖ్యమంత్రులూ సంయమనం పాటించాలని, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కిషన్ సూచించారు. ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జంటనగరాలలో నిర్వహించబోయే కార్యక్రమాలగురించి కిషన్ శనివారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. సంజీవయ్యపార్కులో ఆ రోజున పెద్దఎత్తున యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇద్దరు సీఎమ్లూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఛలోక్తిగా అన్నారు. యోగాను ఎమ్ఐఎమ్ వ్యతిరేకించటం సరికాదని, యోగాను మతాలకు ఎంతమాత్రం ముడిపెట్టరాదని కిషన్ వ్యాఖ్యానించారు. యోగా దినోత్సవం నిర్వహించేందుకు 177 దేశాలు అంగీకరించినట్లు తెలిపారు.