దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. రాజశేఖరరెడ్డి, విజయలక్ష్మి దంపతులకు జగన్మోహన్ రెడ్డి 1972 డిసెంబర్ 21న కడపజిల్లా జమ్మలమడుగు గ్రామంలో జన్మించారు. ప్రాధమిక విద్య పులివెందులలో, హైదరాబాద్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జరిగింది. సమీప బంధువైన డాక్టర్ గంగిరెడ్డి కుమార్తె భారతీదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.
2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా బెంగుళూరులోనే ఉండేవారు. 2004 తర్వాత వ్యాపార కార్యకలాపాలను ముమ్మరంచేసి వ్యాపారాన్ని అతిత్వరగా ఎన్నోరెట్లు అభివృద్ధి చేశారు. సాక్షి పేపర్, సాక్షి టీవీ, భారతీ సిమెంట్స్తోబాటు ఎన్నో వ్యాపారాలను ప్రారంభించారు. 2009లో ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చారు. 2009 ఎన్నికలలో కడప లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ తరపున పోటీచేసి విజయం సాధించారు. అదేసంవత్సరం సెప్టెంబర్ నెలలో రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఒకదశలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి కనిపించింది. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ఒక వర్గం సంతకాల సేకరణకూడా చేసింది. కానీ కాంగ్రెస్ అధిష్ఠానంమాత్రం సీనియర్ నాయకుడు రోశయ్యను ముఖ్యమంత్రిని చేసింది. దీనితో కినుక వహించిన జగన్, తండ్రి మరణవార్త తట్టుకోలేక చనిపోయినవారిని పరామర్శించటానికంటూ ఓదార్పుయాత్ర ప్రారంభించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీని ప్రారంభించారు. మరోవైపు జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని అక్రమంగా వేలాది కోట్లరూపాయలు ఆర్జించారని దాఖలైన కేసుపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. 2012 మే 27న సీబీఐ జగన్ను అరెస్ట్ చేసింది. 16నెలలపాటు జగన్ చంచల్గూడ జైలులో ఉన్నాడు. 2013 సెప్టెంబర్లో సీబీఐ ప్రత్యేక కోర్టు జగన్కు బెయిల్ మంజూరు చేసింది. 2014 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు రాష్ట్రాలలో పోటీ చేయగా 9 లోక్ సభ స్థానాలను, 67 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. జగన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షనాయకుడిగా కొనసాగుతున్నారు.