హైదరాబాద్: విజయవాడ కల్తీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. ఇవాళ విజయవాడలో తన అనుచరులతో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. తర్వాత తన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. తాను ముందు అనుకున్న ప్రకారం తీర్థయాత్రలకు వెళ్ళానని చెప్పారు. రేపు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లొంగిపోతానని అన్నారు. ఈ కేసులో ఈయన 9వ నిందితుడిగా ఉన్నారు. దాదాపు నెలరోజులనుంచి విష్ణు అజ్ఞాతంలో ఉన్నారు. ఈ మధ్యలో షిర్డిలో ఉన్నట్లు కనిపిస్తున్న ఫోటోలు బయటకొచ్చాయి.
కల్తీ మద్యం కేసులో ఐదుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ బార్ తనది కాదని, తన కుటుంబసభ్యులదని విష్ణు అజ్ఞాతంలోకి వెళ్ళకముందు మీడియాకు చెప్పారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ అది లభించలేదు. కృష్ణలంక పోలీసులు మాత్రం ఆయనను అరెస్ట్ చేయబోమని, విచారణకు సహకరించితే చాలని కోర్టు ముందు చెప్పటంతో విష్ణు బయటకు వచ్చారు.