డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులపై కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ వేసిన రూ.10 కోట్ల పరువు నష్టం దావా కేసును ఇవ్వాళ్ళ డిల్లీ పాటియాలా హౌస్ కోర్టు విచారణకు స్వీకరించబోతోంది. డిల్లీ, డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డి.డి.సి.ఏ.)కి అరుణ్ జైట్లీ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో సుమారు రూ.60 కోట్ల కుంభకోణం జరిగిందని అరవింద్ కేజ్రీవాల్ తదితరులు పదేపదే ఆరోపించారు. తనపై నిరాధారమయిన ఆరోపణలు చేస్తూ తన పరువుకి భంగం కలిగిస్తునందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆమాద్మీ పార్టీ నేతలు అశుతోష్, సంజయ్ సింగ్, కుమార్ విశ్వాస్, రాఘవ చడ్డా, దీపక్ బాజ్ పేయిలపై ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ డిశంబర్ 21న డిల్లీ పాటియాలా హౌస్ కోర్టు రూ.10 కోట్లకి పరువు నష్టం దావా వేశారు. దానిని స్వాగతించిన అరవింద్ కేజ్రీవాల్ తాను అటువంటి కేసులకు భయపడబోనని అన్నారు. కనుక అరవింద్ కేజ్రీవాల్ తన ఆరోపణలకు బలమయిన ఆధారాలు నేడు కోర్టుకి సమర్పించవలసి ఉంటుంది లేకుంటే మళ్ళీ చిక్కుల్లో పడతారు. అరవింద్ కేజ్రీవాల్ తన ఆరోపణలకు ఖచ్చితమయిన ఆధారాలు చూపించగలిగితే అరుణ్ జైట్లీ పదవి ఊడవచ్చును.
డి.డి.సి.ఏ.లో జరిగిన అవినీతిపై విచారణ చేసేందుకు అరవింద్ కేజ్రీవాల్ నియమించిన త్రిసభ్య కమిటీ సమర్పించిన 237 పేజీల నివేదికలో డి.డి.సి.ఏ.లో చాలా అక్రమాలు జరుగుతున్నట్లు పేర్కొని దీనిపై సుప్రీం కోర్టుని ఆశ్రయించడం మంచిదని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి సూచింది తప్ప అందులో ఎక్కడా అరుణ్ జైట్లీ అవినీతికి పాల్పడినట్లు పేర్కొనలేదు.కనుక కేజ్రీవాల్ మళ్ళీ ఇబ్బందికరపరిస్థితులు ఎదుర్కోక తప్పదేమో?