హైదరాబాద్: కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకుడు, తలపండిన మేధావి, అనుభవజ్ఞుడు అయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునే ఉద్విగ్నతకు గురిచేసింది ఒక వృద్ధురాలు. ఆమె పెద్దమనసు చూసి చలించిపోయి పాదాభివందనం చేశారు. గుంటూరుజిల్లాలో నిన్న జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఈ ఉద్విగ్న సన్నివేశం చోటుచేసుకుంది.
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతిజిల్లాలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా తెనాలిలో నిన్న జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్రాక్షాయణి అనే వృద్ధురాలు వేదికపైనున్న చంద్రబాబు దగ్గరకు వెళ్ళి రాజధాని కూడా లేకుండా రాష్ట్రాన్ని విభజించినందుకు బాధపడుతూ, తనవంతుగా అమరావతి నిర్మాణానికి రు.2 లక్షలు అందజేశారు. “మనమంతా మద్రాస్‌లో అభివృద్ధి చేశాం, అక్కడనుంచి పంపించారు, తర్వాత హైదరాబాద్‌కు వెళ్ళాం, అక్కడనుంచి కూడా పంపించారు, నువ్వు పడే కష్టం చూశాను, ఉడతాభక్తిగా ఈ మొత్తం ఇస్తున్నాను” అని ద్రాక్షాయణి తనతో అన్నట్లు చంద్రబాబు సభికులకు వివరించారు. తనగురించిగానీ, తాను ఇస్తున్న మొత్తం గురించిగానీ చెప్పొద్దని కోరటమేకాక, చెప్పబోతున్న చంద్రబాబును కూడా మాట్లాడనీయలేదు. ఫోటోగ్రాఫర్లవైపు తిరగాలని కోరగా, తనకు పబ్లిసిటీ అవసరంలేదని చెప్పారు. అయితే ఆమె ఔదార్యం అందరికీ స్ఫూర్తిగా నిలవాలంటూ చంద్రబాబు ఆమెను ఒప్పించి ఆమెను సభికులకు, ఫోటోగ్రాఫర్లకు చూపించారు. ఆమె ఔదార్యానికి ముగ్ధులైన చంద్రబాబు హత్తుకోవటమేకాక కాళ్ళకు దండం పెట్టారు. ఈ సన్నివేశం సభికులను కూడా హత్తుకుంది. సభలో పాల్గొన్న మంత్రులు పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు, ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, కలెక్టర్, ఇతర అధికారులు కూడా ద్రాక్షాయణి ఔదార్యంపట్ల ఆనందం వ్యక్తం చేశారు. వందరూపాయలు చందా ఇచ్చి వేయిరూపాయల పబ్లిసిటీ ఆశించే ఈరోజుల్లో ఆ వృద్దురాలు రెండు లక్షల రూపాయలు ఇచ్చి పబ్లిసిటీ వద్దనటం, ఆమె ఔదార్యానికి చంద్రబాబు శిరస్సు వంచి పాదాభివందనం చేయటం రెండూ ప్రశంసనీయమైనవే!