ప్రధాని నరేంద్ర మోడి లాహోర్ వెళ్లి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ని కలిసి రావడాన్ని నిరసించిన వారిలో బీజేపీ మిత్రపక్షం శివసేన అందరికంటే ముందుంది.
“పాకిస్తాన్ న్ని నమ్మడానికి వీలులేదు. అది ఇదివరకు ఎన్నోసార్లు భారత్ ని వంచించింది. కానీ మళ్ళీ మోడీ పనిగట్టుకొని లాహోర్ వెళ్లి నవాజ్ షరీఫ్ కి స్నేహహస్తం అందించారు. భారతీయుల రక్తంతో తడిసినందున పాకిస్తాన్ శాపగ్రస్తమయింది. దానిపై అడుగుపెట్టిన భారతీయ రాజకీయనాయకుల రాజకీయ జీవితాలు అర్ధాంతరంగా ముగుసిపోయాయి. ఇప్పుడు మోడీ కూడా ఆ గడ్డపై అడుగుపెట్టి వచ్చేరు కనుక ఆయనకి అటువంటి సమస్య ఎదురుకావచ్చును”, అని శివసేన పార్టీకి చెందిన ‘సామ్నా’ పత్రిక జోస్యం చెప్పింది. అది చెప్పినట్లుగానే రెండు వారాలు తిరక్కుండానే పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. నాలుగురోజులుగా మిలటరీ ఆపరేషన్ సాగుతున్నా ఇంతవరకు అది పూర్తి కాలేదు. ఇంకా ఉగ్రవాదులు లోపల దాగి ఉండవచ్చనే అనుమానంతో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఎన్.ఎస్.జి. కమెండోలు, పంజాబ్ పోలీసులు అందరూ కలిసి పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ఆణువణువూ జల్లెడపడుతున్నారు.
పఠాన్ కోట్ పై ఉగ్రవాదుల దాడి గురించి ‘సామ్నా’ పత్రికలో మళ్ళీ చాలా ఘాటుగా ఒక కధనం ప్రచురించింది. “నవాజ్ షరీఫ్ తో కలిసి మోడీ ఒక కప్పు టీ తాగి వస్తే అందుకు ఏడుగురు జవాన్లు బలయ్యారు. మన దేశ సరిహద్దులు భద్రమయినవి కావని, అలాగే మన అంతర్గత భద్రతా వ్యవస్థలు కూడా పటిష్టంగా లేవని ఈ సంఘటన నిరూపించి చూపించింది. కేవలం ఆరుగురు ఉగ్రవాదులతో పాకిస్తాన్ మనదేశ పరువు ప్రతిష్టలను, ఆత్మగౌరవాన్ని మంటగలపగలిగింది. ప్రధాని నరేంద్ర మోడి లాహోర్ పర్యటనకు వెళ్లినప్పుడే మేము పాకిస్తాన్ న్ని నమ్మరాదని హెచ్చరించాము. కానీ ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ పాక్ చేతిలో మరొకసారి మోసపోయాము.”
“ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి సంఘటన జరిగి ఉన్నట్లయితే, తక్షణమే పాక్ పై దాడి చేసి బుద్ధి చెప్పాలని బీజేపీ నేతలు అందరూ డిమాండ్ చేసేవారు. కానీ ఇంత జరిగినా ఇప్పుడు ఎవరూ స్పందించడం లేదు. ఈ ఘటన తరువాత మనం చేసిన ఒకే ఒక్క పని ఏమిటంటే వీర మరణం పొందిన జవాన్లకు ట్వీటర్ లో ఘనంగా నివాళులు అర్పించడమే. కానీ వారు తమ ప్రాణాలు ఎందుకు అర్పించవలసి వచ్చింది? అని ఆలోచించాలి. ప్రధాని నరేంద్ర మోడి ప్రపంచ దేశాలను ఒక్కత్రాటిపైకి తీసుకురావాలని ప్రయత్నించడం మానుకొని ఇప్పటికయినా దేశంపై దృష్టి పెడితే మంచిది. ఇంత జరిగిన తరువాత కూడా మనం ప్రతీకారం తీర్చుకోలేకపోయినట్లయితే గణతంత్ర దినోత్సవం రోజున మన ఆయుధాలను గొప్పగా ప్రదర్శించుకోవడం అనవసరమే,” అని తన ఘాటుగా విమర్శించింది.