హైదరాబాద్: ముంబై నగరానికి చెందిన ఒక 15 ఏళ్ళ కుర్రాడు 117 ఏళ్ళ చరిత్రను తిరగరాశాడు. ఒక ఇంటర్ స్కూల్ టోర్నమెంట్లో ఒకే ఇన్నింగ్స్‌లో 1,009 పరుగులు చేశాడు. 323 బంతులలో అతను ఈ ఘనతను సాధించాడు. ఈ స్కోరులో 129 ఫోర్లు, 59 సిక్సర్లు ఉన్నాయి. ఒక ఆటోరిక్షా డ్రైవర్ కుమారుడైన ఈ కుర్రాడి పేరు ప్రణవ్ ధనవాడే. ఐదేళ్ళ వయసునుంచి క్రికెట్ ఆడుతున్నాడు. వికెట్ కీపర్-బ్యాట్స్‌మ్యాన్ అయిన ఇతనికి మహేంద్రసింగ్ ధోని అంత పెద్ద క్రికెటర్ కావాలన్నది కల. తనకు వరల్డ్ రికార్డ్ గురించి తెలియదని, ఇండియన్ రికార్డ్ 300 అని తెలుసని, దానిని బద్దలు కొట్టాలని మాత్రమే అనుకున్నానని ప్రణవ్ చెప్పాడు. తనకు బ్యాటింగ్ చేస్తున్నంతసేపూ నెర్వస్‌గా ఉందని అన్నాడు. సోమవారానికి 652 పరుగులు చేసిన ప్రణవ్, ఇవాళ్టి 1,009 స్కోరుతో అతని జట్టు స్కోరు మూడు వికెట్ల నష్టానికి గానూ 1465కు చేరింది. దీనితో 1926లో విక్టోరియా జట్టు న్యూ సౌత్ వేల్స్ జట్టుపై చేసిన 1,107 పరుగుల రికార్డును బద్దలు కొట్టినట్లయింది. ముంబాయిలోని కళ్యాణ్ ప్రాంతంలోని యూనియన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్లో ఈ మ్యాచ్ జరిగింది. మరోవైపు ప్రణవ్ను క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ మెచ్చుకున్నాడు. ట్విట్టర్లో అభినందనలు తెలుపుతూ ప్రణవ్ మరింత ఎత్తులకు ఎదగాలని పేర్కొన్నాడు.