హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడి పఠాన్‌కోట్ ఘటనపై పాకిస్తాన్ ఇవాళ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు ఫోన్ చేశారు. పఠాన్‌కోట్‌లో దాడి వెనక ఉన్న తీవ్రవాదులపై, తీవ్రవాద సంస్థలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పాకిస్తాన్ ప్రభుత్వం సత్వరమే నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటుందని షరీఫ్ ప్రధాని మోడికి హామీ ఇచ్చారని, దాడికి సంబంధించిన సమాచారాన్నంతటినీ ప్రభుత్వం పాకిస్తాన్‌కు అందజేసిందని భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. నవాజ్ షరీఫ్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నారు.
మరోవైపు శనివారం పఠాన్‌కోట్ ఎయిర్ ఫోర్స్ బేస్‌పై జరిగిన దాడికి సంబంధించి అక్కడ భద్రతాలోపాలు ఉన్నది నిజమేనని రక్షణమంత్రి మనోహర్ పారికర్ అంగీకరించారు. ఆయన ఇవాళ పఠాన్‌కోట్‌లో మీడియాతో మాట్లాడారు. మొత్తం ఆరుగురు తీవ్రవాదులను హతమార్చామని, కూంబింగ్(గాలింపు) ఇంకా కొనసాగుతోందని చెప్పారు. భారీ కుట్రతో వచ్చిన తీవ్రవాదులను తుదముట్టించటంలో భద్రతాదళాలు అద్భుతమైన పనితీరు కనబరిచారని మెచ్చుకున్నారు. ఎయిర్ బేస్‌లోని ఆయుధ సామాగ్రికి ఎటువంటి హానీ జరగలేదని పారికర్ చెప్పారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు సైనికులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, తీవ్రవాదుల దాడి జరగటానికి ఆరుగంటల ముందు కిడ్నాప్ అయిన గుర్దాస్పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ పొంతన లేని మాటలు చెబుతుండటంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) అధికారులు ఆయనను ప్రస్తుతం ఇంటరాగేట్ చేస్తున్నారు.