హైదరాబాద్: రాజమండ్రి మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కల్తీ మద్యం కేసులో అరెస్టయిన కాంగ్రెస్ నేత మల్లాది విష్ణుకు బాసటగా నిలిచారు. విష్ణును కావాలనే ఈ కేసులో ఇరికించారంటూ టీడీపీ ప్రభుత్వంపై ఇవాళ విజయవాడలో నిప్పులు చెరిగారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చినా ఎందుకు బయటపెట్టటం లేదని ప్రశ్నించారు. పోలీసులకు స్వేఛ్ఛనిస్తే అసలైన నిందితులను బయటపెడతారని అన్నారు. ప్రభుత్వం ఈ కేసును రాజకీయ కోణంలోనే చూస్తోందని ఆరోపించారు. విష్ణును అప్రదిష్ఠపాలు చేసేందుకే మద్యం దుకాణంలోని వాటర్ కూలర్లో విషం కలిపారని అన్నారు. టెర్రరిస్ట్ నేపథ్యం ఉన్నవారే ఇలాంటి దురాగతాలకు పాల్పడతారని, జైల్లో పెట్టినంత మాత్రాన మల్లాది విష్ణు ప్రతిష్ఠ ఏ మాత్రం దెబ్బ తినదని చెప్పారు. గతంలో వంగవీటి రంగాను కూడా జైల్లో పెట్టారని, విడుదలైన తర్వాత వంగవీటి ఏ స్థాయికి ఎదిగారో అందరికీ తెలుసని అన్నారు. హెరిటేజ్ పాలు తాగి ఎవరైనా చనిపోతే చంద్రబాబును అరెస్ట్ చేస్తారా అని ఉండవల్లి ప్రశ్నించారు.