జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో కలిసిపోటీ చేస్తున్న తెదేపా-బీజేపీలు మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నిజాం కాలేజి మైదానంలో ‘శంఖారావం’ పేరిట ఒక బహిరంగ సభను నిర్వహించబోతున్నాయి. తెదేపా తెలంగాణా అధ్యక్షుడు ఎల్.రమణ, ఆ పార్టీ సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాగంటి గోపినాద్ తదితరులు, బీజేపీ నగర అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, ఆ పార్టీ నేతలు డా. లక్ష్మణ్, రామచంద్రా రెడ్డి తదితరులు నిన్న అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ తమ కూటమికి ఓటేసి జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో గెలిపిస్తే హైదరాబాద్ లో స్థిరపడిన ఆంద్ర వాళ్ళకే డిప్యూటీ మేయర్ పదవిని ఇస్తామని తెలిపారు. మేయర్ పదవి బిసి జనరల్ కి కేటాయించి ఉండకపోయుంటే దానినే వారికి ఇచ్చేవారిమని తెలిపారు.
ఈరోజు సాయంత్రం జరుగబోయే సభకి రెండు పార్టీలకి చెందిన ప్రముఖ నేతలు అందరూ హాజరవుతారు. దీనికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాజరవుతారని రేవంత్ రెడ్డి కొన్ని రోజుల క్రితం తెలిపారు. కానీ ఆయన ఈ సభకు హాజరవుతారో లేదో ఇంతవరకు ఎవరికీ తెలియదు. జి.హెచ్.ఎం.సి. ఎన్నికల ప్రచారంలో తెదేపా, బీజేపీ కూటమికి ఈ సభ అత్యంత కీలకమయినదని చెప్పవచ్చును.
ఒకవేళ చంద్రబాబు నాయుడు ఈ సభకు హాజరు కానట్లయితే ఇక ఆయన తెలంగాణా రాజకీయాలలో, తెలంగాణా తెదేపా పార్టీ వ్యవహారాలలో కూడా జోక్యం చేసుకోబోరని భావించవచ్చును. ఒకవేళ ఈ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నా తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేసినట్లయితేనే దానికి ఓ అర్ధం ఉంటుంది. అలాకాకుండా ఈ సభకు హాజరయి ఎవరిపై ఎటువంటి విమర్శలు చేయకుండా హైదరాబాద్ ని తాను ఏవిధంగా అభివృద్ధి చేసింది చెప్పుకొంటూ స్వోత్కర్షతో సరిపెట్టినట్లయితే అది కూడా ఆయన తెరాస పట్ల మెతక వైఖరి అవలంభించదలచినట్లు స్పష్టం చేస్తుంది. అత్యంత ముఖ్యమయిన ఈ సభకు చంద్రబాబు నాయుడు హాజరయితే ఒక సమస్య. హాజరు కాకుంటే కేసీఆర్ కి భయపడి తెలంగాణాలోని పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారనే అనుమానాలు ఇంకా బలపడతాయి. ఆ కారణంగా పార్టీ నేతలని నిరాశ కలిగించినట్లవుతుంది. కనుక ఈ సభ చంద్రబాబు నాయుడుకి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగానే తయారయిందని భావించవచ్చును.