జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో వైకాపా కూడా పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ తెలంగాణా అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ ఎన్నికలలో ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తుందని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయంలోనే హైదరాబాద్ అన్ని విధాల అభివృద్ధి చేయబడింది కనుక, ప్రజలని ఓట్లు అడిగే హక్కు కేవలం తమ పార్టీకే ఉందని ఆయన అన్నారు.
జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో వైకాపా పోటీ చేయడంలో పెద్ద వింతేమీ కాదు. కానీ పొత్తులు పెట్టుకోవడానికి వేరే పార్టీలు ఏవీ లేవనే సంగతి తెలిసి కూడా తాము ఎవరితో పొత్తులు పెట్టుకోబోమని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది.
అలాగే వైకాపాకు తెలంగాణాలో బలం, ప్రజాదరణ లేదనే సంగతి తెలిసి ఉన్నప్పటికీ అధికార తెరాసకు పరోక్షంగా సహకరించడానికే ప్రతీ ఎన్నికలలో పోటీ చేస్తుంతుంటుందనే సంగతి బహిరంగ రహస్యమే.తెరాసతో నేరుగా పొత్తులు పెట్టుకొన్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీపై వ్యతిరేక ప్రభావం పడే ప్రమాదం ఉంది కనుకనే వైకాపా తెరాసతో పొత్తులు పెట్టుకోవడానికి వెనుకాడుతోందని చెప్పవచ్చును. ఆ పార్టీతో వైకాపా పొత్తులు పెట్టుకోకపోయినా, ఎన్నికల తరువాత అవసరమయితే జి.హెచ్.ఎం.సి. పీఠం దక్కించుకోవడానికి తెరాసకే మద్దతు ఇస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చును. కానీ ఈ ఎన్నికలలో తెరాస పార్టీ స్వయంగా 80కి పైగా స్థానాలు సంపాదించుకొని జి.హెచ్.ఎం.సి. పీఠం దక్కించుకోగలనని ధీమా వ్యక్తం చేస్తోంది కనుక తెరాసకు మద్దతు ఇచ్చి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసిన అవసరం కూడా ఉండక పోవచ్చును. హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్రా ప్రజల ఓట్లను చీల్చాలంటే అది ఒక్క వైకాపా వల్లనే సాధ్యం అవుతుందనేది కూడా బహిరంగ రహస్యమే. కనుక ఈ ఎన్నికలలో తెరాస గెలుపు ఖరారు చేసేందుకు వైకాపా పోటీ చేస్తే అదేమీ పెద్ద వింత కాదు.
తెలంగాణాలో జరిగే ఎన్నికలలో పోటీ చేయడానికి వైకాపా ఒక అత్యద్భుతమయిన ఫార్ములా కనుగొంది. అదే..స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే తెలంగాణా అభివృద్ధి చెందింది కనుక తమ పార్టీకి మాత్రమే ప్రజలను ఓట్లు అడిగే హక్కు ఉందనే వితండ వాదన. అయితే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయంలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది తప్ప ఇంతవరకు ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేని ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి చెందదనే సంగతి అందరికీ తెలుసు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డికి ఆయన కుమారుడు కావచ్చును. కానీ దానర్ధం ఆయన చేసిన పనులన్నిటి క్రెడిట్ తనకే స్వంతం అనుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే వారసత్వంగా సంక్రమించడానికి అదేమీ ఆస్తి కాదు కదా?
అయినప్పటికీ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణంగా కారణంగా ప్రజలలో ఉండే సానుభూతిని ఉపయోగించుకొంటూ, ఇదివరకు జగన్మోహన్ రెడ్డి తన తండ్రి పేరిట ఓదార్పు యాత్రలు చేసి ఆంధ్రాలో తన పార్టీని బలోపేతం చేసుకొన్నారు. ఆ తరువాత ఆయన పేరు చెప్పుకొనే ప్రజలను ఓట్లు అడిగేవారు. ఇప్పుడు ఆంధ్రాలో పార్టీ చాలా బలపడింది కనుక తండ్రి పేరు చెప్పుకొని ప్రజలను ఓట్లు అడగడటం క్రమంగా తగ్గించేసి, తన రాజకీయ ప్రత్యర్ధులని విమర్శిస్తూ, ప్రభుత్వంపై పోరాటాలు చేస్తూ ప్రజలను ఓట్లు అడుగుతుండటం అందరూ గమనించవచ్చును. కానీ తెలంగాణాలో తెరాసతో ఆ పార్టీకి ఉన్న రహస్య అనుబందం కారణంగా అక్కడ ప్రభుత్వంపై పోరాడలేని పరిస్థితి ఉంది. అందుకే అక్కడ యధాప్రకారం ప్రతీ ఎన్నికలలో తన తండ్రి పేరు చెప్పుకొని ఓట్లు అడగవలసి వస్తోంది. అది చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడంగానే భావించవచ్చును. అయితే ఆ చెట్టు పక్కనే అంతకంటే బలమయిన మర్రి చెట్టులాగ తెరాస ఎదిగింది. కనుక తెరాస నీడలో ‘ఆ చెట్టు’ ఇంకా ఎంతో కాలం మనగలిగే అవకాశం లేదు. కానీ వైకాపాకి వేరే ప్రత్యామ్నాయాలు ఏవీ లేవు కనుక ఇంకా ఆ చెట్టు పేరు చెప్పుకొనే కాయలు అమ్ముకోవలసివస్తోందని చెప్పవచ్చును. ఆ ప్రయత్నాలు ఫలించినా ఫలించకపోయినా వైకాపా ఆ మర్రి చెట్టుకి తీగలా అలుకుపోయి తన మనుగడ కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుంది.