అమెరికాలో సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీలో చేరడానికి తెలుగు విద్యార్ధులు వరుసగా వెళుతుండటం, వారిని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఉగ్రవాదులను ప్రశ్నించినట్లు ప్రశ్నించి, అవమానించి వెనక్కి తిప్పి పంపేస్తుండటం చూస్తుంటే చందమామ కధలో పట్టువదలని విక్రమార్కుడు కధ గుర్తుకు వస్తోంది. మొదటి బ్యాచ్ విద్యార్ధులను అమెరికా నుండి తిప్పి పంపేసిన తరువాత దేశ వ్యాప్తంగా దానిపై చాల నిరసనలు వ్యక్తం అవడంతో భారత్ లోని అమెరికన్ కౌన్సిలేట్ అందుకు క్షమాపణలు కూడా చెప్పింది. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ కూడా ఇచ్చింది. కానీ నేటికీ విద్యార్ధులు అమెరికా వెళుతూనే ఉన్నారు. వారిని వెనక్కి తిప్పి పంపిస్తూనే ఉన్నారు.
మొన్న శనివారం సాయంత్రం మళ్ళీ మరో 6 మంది తెలుగు విద్యార్ధులను అమెరికాలో ప్రవేశించడానికి అనుమతించలేమని చెపుతూ వెనక్కి తిప్పి పంపబడ్డారు. వారితో కలిపి ఇంతవరకు అమెరికా నుండి వెనక్కి తిరిగి వచ్చిన తెలుగు విద్యార్ధుల సంఖ్య 100కి చేరింది. అయినా ఇంకా చాలా మంది తెలుగు విద్యార్ధులు పట్టువదలని విక్రమార్కుల్లాగా అమెరికా బయలుదేరవచ్చును.
ఈ సమస్య కేవలం తెలుగు విద్యార్ధులకు మాత్రమే ఎదురవుతోందని వెనక్కి తిరిగి వచ్చిన విద్యార్ధులు చెపుతున్నారు. మిగిలినవారికి అదే యూనివర్సిటీలో చేరడానికి అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమతిస్తున్నారని వారు చెపుతున్నారు. తమ వద్ద అన్ని పత్రాలు, ఆధారాలు సరిగ్గానే ఉన్నప్పటికీ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు కేవలం తమని మాత్రమే వెనక్కి తిప్పి పంపిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అయితే ఈ సమస్యకు అసలు కారణం ఏమిటి? దీనికి పరిష్కరం ఏమిటి? దీనిని ఎవరు పరిష్కరిస్తారు? ముఖ్యంగా తెలుగు విద్యార్ధుల పట్లే అమెరికన్ అధికారులు ఎందుకు వివక్ష చూపిస్తున్నారు? దానికి కారణాలు ఏమిటి? అనే విషయంపై కూడా ఆరా తీసి తెలుసుకోవలసిన అవసరం ఉంది.
ఈ ప్రశ్నలకు సరయిన సమాధానాలు రాకుండా తెలుగు విద్యార్ధులు అమెరికా బయలుదేరడం అంత వివేకమనిపించుకోదు. భారత్ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ సమస్యను పరిష్కరిస్తామని అంతవరకు విద్యార్ధులను తమ అమెరికా ప్రయాణాలను వాయిదా వేసుకోమని కోరారు. కానీ ఆమె మాటలు పట్టించుకోకుండా ఇంకా విద్యార్ధులు అమెరికా బయలుదేరుతూనే ఉన్నారు. బహుశః ఇప్పటికే ఏర్పాట్లు అన్ని పూర్తి చేసుకొని ఆ విశ్వవిద్యాలయానికి, విమాన టికెట్లకి డబ్బు చెల్లించి ఉన్న కారణంగానే విద్యార్ధులు రిస్క్ తీసుకొని అమెరికా బయలుదేరుతున్నరేమో? ఈ విషయంలో విద్యార్ధుల, వారి తల్లి తండ్రుల ఆందోళన అర్ధం చేసుకొని, విద్యార్ధులు నష్టపోకుండా చూసే బాధ్యత కేంద్రప్రభుత్వానిదే.