హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భద్రతాపరమైన ముప్పు ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ విషయంలో అనుక్షణమూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాయి. ముఖ్యమంత్రి ప్రయాణించే హెలికాప్టర్, విమానం తదితర వాహనాలను ప్రయాణానికి ముందు క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని ప్రభుత్వానికి రాసిన లేఖలో సిఫార్సు చేశారు. విజయవాడలో ఆయన అధికార నివాసం లింగమనేని గెస్ట్ హౌస్ కృష్ణానది ఒడ్డున ఉన్నందున నదిలో మరపడవలతో పోలీసులు 24 గంటలూ కాపలా కాసేవిధంగా ఏర్పాట్లు చేయాలని, ఆ బోట్లలో గజ ఈతగాళ్ళు, సీఆర్పీఎఫ్ పోలీసులు, స్విమ్మింగ్ నెట్ ఉండాలని పేర్కొన్నారు. చంద్రబాబుపై అలిపిరిలో నక్సలైట్ల దాడి జరిగిన నాటినుంచి ఆయనకు జడ్ కేటగరి సెక్యూరిటీ అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కృష్ణా కరకట్టపైనున్న లింగమనేని గెస్ట్ హౌస్లో ఉంటుండటంతో ఆ కరకట్ట పొడవునా ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గంలో సీసీ కెమేరాలను అమర్చాలని పోలీసులు గతంలోనే నిర్ణయించారు.