నా కష్టకాలంలో నా సన్నిహితులు, స్నేహితులు ఎవ్వరూ పక్కన లేరు
నేను అండగా ఉన్న వ్యక్తులు కూడా లేరు
– ఇదీ అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్లో పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలు. అభిమానులే గొప్ప అని చెప్పడానికి ఇలాంటి ఉపమానాల్ని ఎంచుకున్నాడా, లేదంటే పవన్ నిజంగానే అన్ని కష్టాలు పడ్డాడా అనేది ఇప్పుడు ఓ హాట్ టాపిక్‌గా మారింది.
ఇంతకీ పవన్ కష్టాలేంటి?? ఎవరి అండా లేకుండా ఎందుకు అనాధగా ఉండాల్సివచ్చింది? అనేదినికి పవన్ దగ్గరైనా సమాధానం ఉందా? పవన్ ఆర్థిక పరిస్థితిపై ముందు నుంచీ చాలామందికి సందేహాలు. అతనో సూపర్ స్టార్. కోట్ల పారితోషికం తీసుకుంటుంటాడు. అయినా సరే `అప్పుల్లో ఉన్నా` అంటుంటాడు. పవన్‌కి మనీ మేనేజ్మెంట్ తెలియదన్నది సన్నిహితుల మాట. అదే నిజం అనుకుందాం. పవన్ కష్టాలకూ అదే కారణం అనుకుందాం. అయితే పవన్ డబ్బుకి విలువ ఇచ్చే మనిషి కాదే. అలాంటప్పుడు పవన్‌కి కష్టాలేముంటాయి?
పోనీ సినిమాలు తీసి నష్టపోయాడా అంటే అదీ లేదు. రాజకీయాల్లోకి వచ్చి ఇరుక్కుపోయాడా అంటే అదీ కాదు. పవన్ పార్టీ పెట్టాడు తప్ప, ఎన్నికల్లో ఇంత వరకూ పోటీ చేయలేదు. కాబట్టి ఆర్థిక భారం పడే అవకాశమే లేదు. ఒకవేళ అది భారం అనుకొంటే.. పవన్ ఏరి కోరి రాజకీయాల్లోకి వచ్చాడు. అలాంటప్పుడు దాన్నీ స్వీకరించాలి.
నా వెనుక మా అన్న ఉన్నాడు. మా అన్న ముందు నేనున్నా అని చెప్పే పవన్ ని కష్టకాలంలో ఆ అన్నయ్య ఆదుకోలేదా??
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నాగబాబుని పవన్ ఆదుకున్నాడన్నది జగమెరిగిన సత్యం! ఆర్థికంగా పవన్ స్థిరంగా ఉన్నాడు కాబట్టే అన్నకు ఆపన్నహస్తం అందించాడు. అలాంటి పవన్‌కి ఆర్థిక ఇబ్బందులేంటి? చెప్పుకోకూడని కష్టాలేంటి?
తక్కువలో సినిమా తీసి ఎక్కువకు అమ్ముకొనే నైజం గురించి పవన్ మాట్లాడాడు. సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాలు ఈ బాపతులో తీసినవే కదా?
పంపిణీదారులు నష్టపోతే చూడలేను.. అంటున్నాడు. సర్దార్, కాటమరాయుడు వల్ల నష్టపోయినవాళ్లకు పవన్ ఏం ఇచ్చాడు. సర్దార్ నష్టాలు పూడ్చుకోమని కాటమరాయుడు తీశాడు. రెండింటితో పంపిణీదారులు మునిగిపోయారు. వాళ్లని పవన్ ఆదుకోలేదు కదా? అంటే తానిచ్చిన స్టేట్మెంట్లోనే క్లారిటీ లేదు. తన మాటపై తనకే నిలకడ లేదు. యాంటీ పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోవడానికీ, మళ్లీ మైకులు విరిగిపోయేలా స్పీచులు దంచికొట్టడానికి, ట్విట్టర్లు విమర్శల కంపు కొట్టడానికి ఆస్కారం ఇచ్చాడంతే!