ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ ని తలపించిన ఆర్కే నగర్ ఉప ఎన్నికలూ, వాటి ఫలితాలూ, వాటి మీద వ్యాఖ్యానాలూ అన్నీ ముగిసాయి. అయితే ఇప్పుడు తమిళనాట, ఆ మాటకొస్తే దక్షిణ భారతం మొత్తం మీద ఒక విశ్లేషణ జరుగుతోంది. బిజెపి తో సాంగత్యం దక్షిణాదిన ప్రాంతీయ పార్టీలకి శాపం గా మారుతోందా అన్న చర్చ జరుగుతోంది.
నిజానికి జయలలిత మరణాంతరం అన్నా డిఎంకె లో ముసలం పుట్టడం, పన్నీర్ పార్టీ నుంచి అప్పట్లో బయటికి రావడం తెలిసిందే. ఆ సమయం లో పన్నీర్ మీద చాలా పాజిటివ్ మూడ్ ఉండేది. ఆర్కే నగర్ లో పన్నీర్ వర్గమే గెలుస్తుందనే విశ్లేషణ వినిపించేది. అయితే పన్నీర్ పళని స్వామి కలిసిపోయి దినకరన్ ని బయటికి పంపాక ఈక్వేషన్స్ మారిపోయాయి. అన్నా డిఎంకె లో వర్గపోరు చూసి, బహుశా డిఎంకె లాభపడుతోందేమోనన్న విశ్లేషణలు కూడా జరిగాయి. అయితే రెండాకుల గుర్తు పళని-పన్నీర్ సాధించడం తో మళ్ళీ పోరు ఉత్కంఠభరితమైంది. కానీ రెండాకుల గుర్తు లేకపోయినా దినకరన్ అంత భారీ విజయం సాధించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అయితే పళని-పన్నీర్ వర్గాలు రెండాకుల గుర్తు ఉండీ, అన్నా డిఎంకె కంచుకోట అయిన స్థానం లో చిత్తవడానికి కారణం, ప్రజల్లో వీరి మీద, ప్రత్యేకించి వీరు మోదీ కి మోకరిల్లడం మీదా ఉన్న వ్యతిరేకత కి నిదర్శనం గా విశ్లేషకులు భావిస్తున్నారు. మరి అలాంటపుడు ప్రతిపక్ష డిఎంకె లాభపడాల్సింది. కానీ సరిగ్గా ఎన్నికల రోజు 2జీ స్కాం నుంచి బయటపడటం డిఎంకె కలిసిరాకపోగా మోదీ తో డిఎంకె కూడా కలిసిపోయారనే సంకేతాలు వెలువడ్డాయి. ఇక బిజెపి కి నోటా కన్నా తక్కువ ఓట్లు రావడం బిజెపి దయనీయ స్థితి ని సూచిస్తోంది. ఏది ఏమైనా బిజెపి కి మోకరిల్లారన్న కారణం తో పళని వర్గాన్ని, మోదీ తో కలిసిపోయారన్న కారణం తో డిఎంకె ని ఓటర్లు దెబ్బకొట్టారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఇటు ఎపి లోనూ శక్తివంతమైన కేంద్ర ప్రభుత్వాన్ని, సోనియా గాంధీ ని ఢీకొట్టాడన్న ఒపీనియన్ తో 2012 ఉప ఎన్నికల్లో జగన్ కి బ్రహ్మరథం పట్టిన జనాలు అదే సోనియా తో జగన్ కుమ్మక్కయాడన్న ప్రచారాన్ని నమ్మి 2014 లో జగన్ ని ప్రక్కనపెట్టారు. దక్షిణాదిని కేంద్రం చిన్నచూపు చూస్తుందన్న అభిప్రాయం దశాబ్దాలుగా ఉన్నదే. ఆ క్రమం లో కేంద్ర మీద కాస్తో కూస్తో వ్యతిరేకత దక్షిణాది రాష్ట్రాల్లో ఎప్పుడూ ఉండేదే. అందుకే 1983 లో ఎన్ టీయార్ మొదలుకుని 2012 లో జగన్ దాకా కేంద్రాన్ని ఎదిరించిన నాయకులకి ప్రజలు ప్రతిసారీ మద్దతిచ్చారు. కానీ అదే కేంద్రం తో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వచ్చినా, కేంద్రం ముందు మోకరిల్లినా త్రిప్పికొడుతున్నారు.
మరి ఈ “ప్యాటర్న్”, 2019 లోనూ కొనసాగుతుందా,ఎపి లో ఎలా ఉంటుంది అన్న విషయాల కొరకు వేచి చూడాలి !!!