గుజరాత్ లో మరోసారి అధికారం దక్కించుకున్న తరువాత భాజపా దృష్టి ఇతర రాష్ట్రాలపై పడిందనేది తెలిసిందే. ముందుగా కర్ణాటక, ఆ తరువాత తెలుగు రాష్ట్రాల్లో పార్టీని మరింత పటిష్టం చేసే వ్యూహరచనలో కమలనాథులు సంసిద్ధం అవుతున్నారు. నిజానికి, ఏపీలో తెలుగుదేశం భాగస్వామ్య పక్షంగా ఉన్నప్పటికీ… స్వతంత్రంగా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలపై భాజపా అధినాయకత్వం దృష్టి సారించింది. దీన్లో భాగంగా ఉత్తరప్రదేశ్ మోడల్ ను ఆంధ్రాలో ప్రయోగిస్తోంది. యూపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందే భాజపా రంగంలోకి దిగింది. వార్డుల నుంచి నియోజక వర్గ స్థాయి వరకూ ప్రతీ దశలో పార్టీ ప్రచారానికి అనుసరించిన వ్యూహాన్నే ఆంధ్రాలో కూడా ప్రవేశ పెడుతున్నారు. నిజానికి, ఆంధ్రాలో గ్రామ స్థాయి నుంచే భాజపా ప్రచార వ్యూహానికి ఇప్పటికే శ్రీకారం చుట్టేసిందని చెప్పొచ్చు..!
రాష్ట్రంలోని మొత్తం 175 నియోజక వర్గాల్లోనూ పార్టీ ప్రచారానికి 175 మంది ఫుల్ టైమ్ ప్రచారకర్తల నియామకం చేస్తున్నారు. వీరికి జీతాలు కూడా ఉంటాయి. వీళ్లకి అవసరమైన ద్విచక్ర వాహనాలను ఉత్తరప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా తెప్పించుకున్నారు! అక్కడ ఎన్నికల్లో వాడిన వాహనాలే అవి. కాబట్టి, ఆ సెంటిమెంట్ ను కొనసాగించాలనే ఉద్దేశంతోనే అక్కడి వాహనాలను ఆంధ్రాకు రప్పించారు. ఈ వాహనాలు విజయవాడలోని భాజపా కార్యాలయానికి ఇప్పటికే చేరాయి. వీటికి ఆంధ్రా రిజిస్ట్రేషన్లు చేయించి… నియోజక వర్గానికి ఒకటి చొప్పున ప్రచారకర్తలకు ఇస్తారు. ఇప్పటికే ఓ 30 మంది ప్రచారకర్తల్ని నియామకం పూర్తయిందని, వాహనాలను కూడా వారికి ఇచ్చారని తెలుస్తోంది. త్వరలోనే మిగతా నియోజక వర్గాలకు సంబంధించిన నియామకాలు కూడా పూర్తవుతాయి. ఈ ప్రచారకర్తలు ప్రతీరోజూ ఏదో ఒక గ్రామం, లేదా పట్టణాల్లో ఒక వార్డును సందర్శిస్తారు. అక్కడి స్థానిక భాజపా నేతల సాయంతో పార్టీకి సంబంధించిన పనుల్లో పాల్గొని.. ఆ సమాచారాన్ని నేరుగా విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి అందజేస్తారు.
ఈ మోడల్ యూపీలో విజయవంతమైంది. కానీ, ఆంధ్రాలో పరిస్థితి అందుకు భిన్నం కదా. ఎందుకంటే, యూపీలో అయితే వి.హెచ్.పి., ఆర్.ఎస్.ఎస్. వంటి సంస్థలు భాజపా ప్రచార కార్యక్రమానికి తోడ్పాటు ఇచ్చాయి. అక్కడ రామజన్మభూమి అంశం కీలకం కాబట్టి! హిందుత్వ అంశం బలమైన ప్రచారాంశం. ఆంధ్రాలో అలాంటి అవకాశం భాజపాకి ఎక్కడుంది..? భాజపాకి అనుబంధంగా పనిచేసే ఇతర సంస్థలు లేవు. హిందుత్వ లాంటి అంశాల కంటే, స్థానిక సమీకరణల ప్రాధాన్యత ఇక్కడ ఎక్కువ. పైగా, టీడీపీతో పొత్తు ఉంది. అంతకుమించి, క్షేత్రస్థాయిలో క్రియాశీలంగా పనిచేసే నాయకులు భాజపాకి ఎంతమంది ఉన్నారనే ప్రశ్న కూడా ఉంది కదా!