ఇటీవల గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో ముగ్గురు యువజనులు చూపించిన గణనీయప్రభావం దేశమంతా గమనించింది. రాజకీయాల్లో సామాజిక తరగతుల పాత్ర పెరుగుతున్నదనే వాస్తవానికి ఈ ఫలితం అద్దం పట్టింది. చాలా కాలంగా లాల్ నీల్ అంటున్న సిపిఎం నాయకత్వం తెలంగాణలో ఇప్పుడు ఆ నినాదానికి ఒక వేదిక రూపం కల్పిస్తున్నది. టి మాస్ పేరిట 27 సంస్థలు పార్టీలనూ కలపి ఏర్పాటు చేసిన వేదిక ఎన్నికల్లో చూపించే ప్రభావంపై ప్రధాన పార్టీలు రకరకాల అంచనాలు వేస్తున్నాయి. కాంగ్రెస్ అయితే తమను టిమాస్ బలపర్చాలని కోరుకుంటుంది గాని అది జరిగే పని కాదు. ఆ పార్టీతో పొత్తు ప్రసక్తిలేదని సిపిఎం చెప్పేసింది. సిపిఐ తమతో వస్తుందని కాంగ్రెస్‌వారు చెప్పుకున్నారు గాని ఇప్పటికైతే ఆ పార్టీ కూడా వ్యూహం ప్రకటించలేదు.ఇప్పట్లో ప్రకటించేంత తొందర కూడా వుండదు. తమతో సిపిఐ కూడా కలిసివచ్చేలా చర్చలు కృషి చేస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెబుతున్నారు.టిమాస్ ప్రధానంగా పోరాడేది ప్రభుత్వ విధానాలపై గనక టిఆర్ఎస్తో చేతులుకలిపే ప్రశ్నే వుండదు. దానివల్ల ఓట్లు చీలితే తమకు నష్టమని కాంగ్రెస్‌లో కొంత దిగులు వుంది. బిజెపి స్వంతంగా వెళతామని హడావుడి చేసినా చివరకు టిడిపితో చేతులు కలపడం అనివార్యం కావచ్చని ఒక విశ్లేషణ. కాకపోయినా అన్నిచోట్ల పోటీ చేస్తే తమ ఓటింగు పార్టీల జయాపజయాలను నిర్ధారిస్తుందని టిడిపి నేతలంటున్నారు. ఇక టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కూడా పైకి గంభీరంగా మాట్లాడుతున్నా లోలోపల వ్యూహాల కసరత్తులు చేస్తూనే వున్నారట.సర్వేలపై సర్వేలు చేయించడమే గాక ఏ సంస్థ లేదా ఛానల్ సర్వే జరిపినట్టు తెలిసినా తెప్పించుకుంటున్నారు. 106 సీట్లు మావేనని మొదట్లో చెప్పిన జోరు ఇప్పుడులేదు. ద్వితీయ శ్రేణిలో వలసలను ఇప్పుడు టిఆర్ఎస్ విపరీతంగా ప్రోత్సహిస్తున్నది.నమస్తే తెలంగాణలో కనీసం ఒక పేజీ మేరకు ఇలాటి వార్తలే వుంటున్నాయి. నిజంగా గెలుపు తిరుగులేదనుకుంటే ఇంత భారీగా వలసలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి తమలో తాము వివిధ నియోజకవర్గాల రిస్కులను అంచనా వేసుకుంటున్న మాట నిజమేనని టిఆర్ఎస్సీనియర్ నాయకుడొకరు నాతో అన్నారు.ఈ భయం ఎంఎల్ఎలకుకూడా పట్టుకుంది. మరీ ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారిలో తమకు టిఆర్ఎస్ కార్యకర్తల పూర్తి మద్దతు లభిస్తుందా అనే సందేహాలున్నాయి. ఏది ఏమైనా తెలంగాణ రాజకీయాల్లో స్తబ్దత వదిలి సన్నాహక దశ ప్రారంభమైంది.