తెలంగాణ ఏర్పాటు తరువాత అపరిష్కృతంగా ఉన్న అంశాల్లో కీలకమైంది హైకోర్టు విభజన. ఎప్పటికప్పుడు ఇదే అంశాన్ని కేసీఆర్ సర్కారు తెరమీదికి తెస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇదే అంశమై లోక్ సభలో తెరాస ఎంపీలు తీవ్ర స్వరం వినిపించారు. ప్రత్యేక హైకోర్టు కావాలంటూ స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినదించారు. రాష్ట్రం ఏర్పడి మూడున్నరేళ్లు అవుతున్నా ఇంకా హైకోర్టు విభజన కాలేదనీ, దీంతో న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారనీ, వారి పదోన్నతులు వంటి అంశాలతోపాటు, కేసుల పరిష్కరణలో కూడా కొంత ఆలస్యం జరుగుతోందని ఎంపీ జితేందర్ అన్నారు. అయితే, దీనిపై ఒక స్పష్టమైన ప్రకటన చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంటోంది. తెరాస ఎంపీల వాదన ఇలా ఉంటే… తెలంగాణ భాజపా నేతల స్పందన మరోలా ఉంది.
హైకోర్టు విభజన అనేది కేంద్రం పరిధిలో లేని అంశమనీ, దీనిపై భాజపా సర్కారుకు ఎలాంటి అభ్యంతరాలూ లేవని, ఇది సుప్రీం కోర్టు పరిధిలోని అంశమంటూ భాజపా నేత కిషన్ రెడ్డి అంటున్నారు. కోర్టు విభజనకు తాము కూడా ప్రయత్నిస్తున్నామనీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశామని చెప్పారు. హైకోర్టు ఏర్పాటుకు ఆంధ్రా ప్రభుత్వం నుంచి జాప్యం జరుగుతోందనీ, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి సారించాలని కిషన్ రెడ్డి చెప్పారు. అంటే, ఏపీ తీరు వల్లనే కోర్టు విభజన ఆలస్యం అవుతోందని మరోసారి చెప్పారు. నిజానికి, ఆ మధ్య తెరాస నుంచి కూడా ఇలాంటి అభిప్రాయాలే కొన్ని వెలువడ్డాయి.
ఇక, ఆంధ్రా తరఫు ప్రయత్నాల విషయానికొస్తే.. రాజధాని అమరావతిలో మొదటి దశ నిర్మాణాల్లో హైకోర్టు భవనం కూడా ఉంది. దానికి సంబంధించిన నమూనాలను కూడా ఇటీవలే ముఖ్యమంత్రి ఓకే చేశారు. అయితే, ఆ భవనం పూర్తయ్యే వరకూ హైకోర్టు ఏర్పాటు జరగదా అనే అనుమానం అవసరం లేదనే సంకేతాలను కూడా ఏపీ సర్కారు ఇస్తోంది. విజయవాడలో ఓ తాత్కాలిక భవనం కోసం అన్వేషిస్తున్నారనీ, ప్రధాన న్యాయమూర్తిని తీసుకెళ్లి, వారికి అనుకూలమైన భవనాన్ని చూపించి.. కోర్టును ఏర్పాటు చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్టు కొందరు చెబుతున్నారు. సరే, తమవంతు క్రుషి జరుగుతోందనే అభిప్రాయం కల్పించడం కోసమే ఇలాంటి ప్రయత్నాలు అనేవారూ లేకపోలేదు. ఒకవేళ తాత్కాలిక భవనంలోనే కోర్టు ఏర్పాటు చేయాలని అనుకుంటే.. ఆ పనేదో ముందే చెయ్యొచ్చు అనే చర్చ కూడా ఈ సందర్భంగా తెరమీదికి వస్తుంది. అయితే, స్థూలంగా చూసుకుంటే.. ఎన్నికలకు మరో ఏడాదిన్నలోపుగానే సమయం ఉంది. ఈలోపుగా విభజనకు సంబంధించి కొంత ప్రక్రియ మొదలైనా… రెండు రాష్ట్రాలకూ వేర్వేరు కోర్టులు పూర్తి స్థాయిలో ఏర్పాటు కావడానికి కొంత సమయం పట్టేలా ఉందనేదే అనిపిస్తోంది.