ఫాతిమా మెడికల్ కాలేజ్ సమస్య గత కొద్దిరోజులుగా మీడియాలో విరివిగా చర్చించబడ్డ సమస్య. కత కొన్నేళ్ళుగా విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సమస్య.
ఆ మధ్య ఫాతిమా స్టూడెంట్స్, వారి తల్లిదండ్రులతో సమావేశమైన వైద్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ సమస్య పరిష్కారం కోసం వారి ముందు పలు ఆప్షన్లు ఉంచారు. ఆ అప్షన్లు నచ్చని ఫాతిమా విద్యార్థులు పవన్ కళ్యాణ్ ను కలిసి, మంత్రి కామినేని తమ ముందుంచిన ప్రతిపాదనలు వినిపించి, అవి తమకు సమ్మతం కాదని స్పష్టం చెసారు. ఫాతిమా విద్యార్థులు మాట్లాడుతూ , అసలు తప్పు చేసిన ఫాతిమా కాలేజీ యాజమాన్యాన్ని వదిలేసి తమను శిక్షించడమేమిటని తీవ్రంగా ప్రశ్నించారు. అయితె ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం దిశగా సాగుతోంది. సీ ఎం చంద్రబాబు ప్రభుత్వం తరపు నుంచి ఒక ఆర్డినెన్స్ విడుదల చేసి, ఈ సమస్యని పరిష్కరించడానికి సిద్ద్మైనట్టు తెలుస్తోంది. కేరళ లో కన్నార్ మెడికల్ కాలేజ్ విద్యార్థులకి కూడా గతం లో ఇలాంటి సమస్యే ఎదురైతే అప్పుడు కూడా కేంద్రం నుంచి సహకారం అందలేదు. దీంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వమే రంగం లోకి దిగి ఆర్డినెన్స్ విడుదల చేసింది. తద్వారా, ఆ విద్యార్థులు నేరుగా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో చదువుకునే అవకాశం కలిగింది. ఇప్పుడు ఇదే తరహా పరిష్కారం ఎపిలోనూ చూపడానికి ప్రభుత్వం సిద్దమైంది. ఆర్డినెన్స్ కి సీఎం ఆమోదం తెలిపారని ఆరోగ్యశాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య స్వయంగా ప్రకటించడం తో ఇక ఆర్డినెన్స్ రావడం లాంఛనమేనని తెలుస్తోంది.
ఏది ఏమైనా, ఫాతిమా కాలేజ్ విద్యార్థుల సమస్య పరిష్కారం కావడం, ఆ విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి ఆనందం కలిగించే విషయమే!