తెలుగు360.కామ్ రేటింగ్ : 2.75/5
కాన్సెప్ట్ కథ… అనే ట్రెండు నడుస్తోందిప్పుడు. కాన్సెప్ట్ బాగుంటే.. హీరోలు టెమ్ట్ అవుతున్నారు. నిర్మాతలు ఖర్చు పెడుతున్నారు. నచ్చితే.. ప్రేక్షకులూ కాసులు కురిపిస్తున్నారు. నవతరం దర్శకుల గురి.. వీటిపైనే ఉంది. అయితే కాన్సెప్ట్ కథల్లో ఓ చిక్కు ఉంది. కాన్సెప్ట్ తో సినిమాలు కావు. అదో తాడు మాత్రమే. దాని చుట్టూ భావోద్వేగాలు, వినోదం.. జోడించుకోవాలి. ఈ ప్యాకేజీ వర్కవుట్ అయితేనే సినిమాలు నడుస్తాయి. కానీ…. కొంతమంది దర్శకులు మాత్రం ‘తాడు’ పట్టుకొని రంగంలోకి దిగిపోతున్నారు. ఈ తాడుకి ఎలాంటి సపోర్ట్ కావాలో తెలిసిన దర్శకుడు విఐ ఆనంద్. ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’తో కాన్సెప్ట్ కథని పండించి విజయం సాధించాడు. ఈసారి సమాంతర జీవితాలు అనే కొత్త ‘పాయింట్’తో వచ్చాడు. ‘తాడు’ వరకూ బాగుంది. దాని చుట్టూ ఉండాల్సిన బలం ఉందా, ఉంటే సరిపోయిందా??
కథ
జీవా (అల్లు శిరీష్) జీవితంలో జరుగుతున్న సంఘటనలే అచ్చు చుద్దినట్టు శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్) జీవితంలోనూ జరుగుతాయి. అంటే జీవా ప్రస్తుతం.. శ్రీనివాస్‌కి గతం అన్నమాట. జీవా, శ్రీనివాస్ ల జీవితాల్లో ప్రేమ కథ ఒకేలా మొదలవుతుంది. ఒకేలా పూర్తవుతుంది. కానీ శ్రీనివాస్ తాను ప్రేమించిన అమ్మాయిని చంపేస్తాడు. మరి జీవా ఏం చేశాడు?? తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని తన చేతులారా చంపేసుకుంటాడా?? విధిని ఎదిరించి తన ప్రియురాల్ని కాపాడుకుంటాడా?? అనేదే కథ.
విశ్లేషణ
జాన్ ఎఫ్. కెనడీ, అబ్బహాం లింకన్ల జీవితాల్లో ఉన్న సారుప్యతలు తెలుసా??
ఒక్క క్షణం గురించి చెబుతూ చరిత్ర గురించి మాట్లాడడం అనేది మీనింగ్ లెస్ పాయింటే. కానీ ఇక్కడ అవసరం. దర్శకుడు కూడా వీళ్ల జీవితాల్ని ఆధారంగా చేసుకొని ఈ కథ రాసుకున్నాడు. కెనడీ, లింకన్ల మధ్య వందేళ్ల అంతరం ఉంది. కానీ వీరి జననం, జీవితం, మరణం.. ఒకేలా సాగుతాయి. ఇద్దరి జీవితాలు పక్క పక్కన పెట్టుకొని చూస్తే… దేవుడు ఒకే తలరాతని ఇద్దరికి రాశాడా అనిపిస్తుంది. సరిగ్గా అదే పాయింట్‌ని బేస్ చేసుకొని వి.ఐ ఆనంద్ తీసిన సినిమా ఇది. పారలర్ లైఫ్ అనే పాయింట్ మనకు బొత్తిగా టచ్‌లో లేనిదే. అంటే ఏమిటి?? అసలు ఇలాంటి జీవితాలు ఉంటాయా? అనే విషయాన్ని ఓ ప్రొఫెసర్ నోటి నుంచి పలికించాడు. ఇలాంటి కథల టేకాఫ్ చాలా ముఖ్యం. కథలోకి వెళ్లడానికి దర్శకుడు టైమ్ తీసుకొన్నా – ఆ టేకాఫ్ ఎంగేజ్డ్ గా ఉండాలి. కానీ ఆనంద్ ఈ విషయంలో తడబడ్డాడు. తొలి నలభై నిమిషాలు కథ ఎక్కడికి వెళ్తుందో అర్థం కాదు. సన్నివేశాల్ని లాగీ.. లాగీ లాగ్ చేశాడు. సరిగ్గా ఇంట్రవెల్ ముందు పారలల్ లైఫ్ అనే పాయింట్‌తో ఈ కథ ముడి పడుతుంది. అక్కడి వరకూ సహనంగా కూర్చోవాల్సిందే. ఎప్పుడైతే సమాంతర జీవితాల కాన్సెప్ట్ కథతో జత కట్టిందో.. అక్కడి నుంచి ఆసక్తి మొదలవుతుంది.
ఇదే టెంపో ద్వితీయార్థంలోనూ చూపించాడు. తన ప్రేయసిని హీరో ఎలా కాపాడుకుంటాడు? అందుకు ఉన్న మార్గాలేంటి?? అనేవి ఆసక్తి కలిగించాయి. కాకపోతే.. సరిగ్గా సినిమా అయిపోతోందన్న సమయంలో ఓ మర్దర్ ఎలిమెంట్ కథలోకి వస్తుంది. కథ మలుపు తిరగడానికి అదీ ఓ కారణమైంది. కానీ… ఆ మర్డర్ ఎలిమెంట్‌ని మళ్లీ పాతాతి పాత పద్ధతిలోనే చెప్పడం, హీరో.. తన హీరోయిజం చూపిస్తూ… దాన్ని సాల్వ్ చేయడం రొటీన్ అనిపిస్తాయి. ఆసుపత్రులు, అక్కడ జరిగే అరాచకాలు.. దానికీ ఈ ప్యారలల్ లైఫ్‌కీ ముడి పెట్టడం పొంతన కుదర్లేదు. ఎంచుకున్న కొత్త పాయింట్‌ని వదిలేసి.. మరేదో పట్టుకొని.. రెండింటికీ న్యాయం చేయలేకపోయాడనిపిస్తుంది. ఎక్కడికి పోతావు చిన్నవాడాలో.. దర్శకుడు కామెడీతో నడిపించి.. రొటీన్ సీన్స్ దగ్గరా టైమ్ పాస్ చేయించాడు. కానీ ఇక్కడ ఆ మ్యాజిక్ కొరవడింది. తెరపై ఏదో జరుగుతున్నా, ఆర్,ఆర్‌లో ఆఫీల్ వచ్చినా.. తెరపై ఉన్న క్యారెక్టర్స్‌ని చూస్తే ఆ మూడ్‌లోకి వెళ్లకపోతాడు ప్రేక్షకుడు. ఇది దర్శకుడి తప్పు కాదు.. ఆయా పాత్రల్ని పోషించిన వాళ్లని మనం రిసీవ్ చేసుకోకపోవడంలో ఉన్న తప్పు. ప్రధాన పాత్రలపై ప్రేమ పెంచి.. ఆ కథలో ప్రేక్షకుడూ సమాంతరంగా ప్రయాణం చేయలేకపోతే.. ఇలాంటి తప్పిదాలే జరుగుతాయి.
నటీనటుల ప్రతిభ :
శిరీష్ అన్ని కథలకూ సెట్ అవ్వడు. తనకు నన్పే కథల్ని ఎంచుకోవాలి. ఒక్క క్షణం… తాను చేయగలిగిన సినిమానే. జోవియల్‌గా కంటే సీరియెస్ మూడ్‌లోనే ఎక్కువగా కనిపించాడు. కథకు అది అవసరం కూడా. అక్కడక్కడ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇబ్బంది పెట్టినా…. మొత్తానికి ఓకే అనిపిస్తాడు. అయితే మెగా కుటుంబానికి చెందిన రిఫరెన్స్‌లు ఎక్కవ వాడారు. కొండవీటి దొంగ టైటిల్ నుంచి – అజ్ఞాతవాసి లో వినిపించిన డైలాగ్ వరకూ. ఇలాంటివి తగ్గించుకుంటే మంచిదేమో. సురభి అందంగా కనిపించింది. చిట్టి పొట్టి డ్రస్సులు వేయించడం వల్ల.. థియేటర్లో ని యువ ప్రేక్షకులు ఇబ్బంది పడే ఛాన్సుంది. సీరత్ కపూర్ స్ర్కీన్ ప్రెజెన్స్ తక్కువైనా ఉన్నంతలో బాగా చేసింది. అవసరాలకూ కొత్త తరహా పాత్రే. దాసరి అరుణ్ కుమార్ సర్ప్రైజ్ ప్యాకేజ్‌లా అనిపిస్తాడు. విలన్‌గా చేయడం మంచి ఆప్షనే. కాకపోతే ఆ గొంతు తనకు సెట్ కాలేదు. బేస్ తగ్గించాల్సింది.
సాంకేతిక వర్గం:
మణిశర్మ పాటలు ఈ సినిమాకి మైనస్. నేపథ్య సంగీతం, ఆయన అందించిన బీజియమ్స్ బాగున్నాయి. టెక్నికల్‌గా అన్ని విభాగాల్లోనూ సినిమా బాగుంది. అయితే తొలి సగంలో దర్శకుడు బాగా ఇబ్బంది పడ్డాడు. ద్వితీయార్థం గాడిలోకి వచ్చినా.. క్లైమాక్స్ మళ్లీ నిరాశ పరుస్తుంది. డైలాగులు అక్కడక్కడ మెరిశాయి. ఓ పాటని కట్ చేసి, చివర్లో ఎండ్ టైటిల్స్‌లా వాడుకున్నారు. ఆ పాట కథలోఎక్కడ వచ్చినా.. మరింత ఇబ్బంది పడాల్సివచ్చేది.
తీర్పు
ఆనంద్ మరోసారి కొత్త కాన్సెప్ట్‌తో వచ్చాడు. అయితే.. దాని చుట్టూ అల్లిన కథ అంత జనరంజకం కాదు. ఇదే పాయింట్‌ని మరింత తీవ్ర స్థాయిలో ఆలోచించి, సన్నివేశాల పరంగా జాగ్రత్త పడితే బాగుండేది. అలాగని ఒక్క క్షణం చూడకూడని సినిమా కూడా కాదు. రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాల మధ్య కచ్చితంగా కొత్త ఆలోచనలు రేకెత్తించింది. ఆలోచన మంచిదైతే.. ప్రయత్నంలో చిన్న చిన్న లోపాలున్నా.. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. అదే.. ఈ సినిమాకి వరం.
ఫైనల్ టచ్: కాన్సెప్ట్ వరకూ కేక!!
తెలుగు360.కామ్ రేటింగ్ : 2.75/5