తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఇటీవల తీరిక లేకుండా తిరుగుతున్నారు. ఎప్పుడు చూసినా ఏదో సమీక్షలోనో సమావేశంలోనో కనిపిస్తున్నారు. అయితే మరో మంత్రి కెటిఆర్ పాల్గొనే కార్యక్రమాలకూ వీటికీ తేడా వుంటుంది. కెటిఆర్ చుట్టూ బోలెడు హంగామా హంగుదార్లు వుంటే హరీశ్ రావు తనుగానే దూసుకుపోతుంటారు. ఇటీవలనే ఆయన ఆర్ఱరాత్రి కాళేశ్వరం సొరంగం పనులు తనికీ చేయడం పెద్ద వార్తయింది. ముఖ్యమంత్రి కెసిఆర్ కార్యాలయం విషయాల్లో హరీశ్‌ను పెద్దగా భాగస్వామిని చేయకపోవడం వల్లనే ఆయన తనకు తాను పనులు పెట్టుకుంటున్నారనేది పరిశీలకుల అభిప్రాయం. ఇటీవల ఒక టీవీ ఛానల్లో ఈ ప్రశ్న అడిగేశారు కూడా.సిద్దిపేట ప్రాంతంలోనైతే అర్థరాత్రి ఫోన్ కాల్ వచ్చినా హరీశ్ ప్రత్యక్షమవుతున్నారని టిఆర్ఎస్ సీనియర్ నాయకుడొకరు చెప్పారు. ఏది ఏమైనా తమ అధినేత కెటిఆర్‌ను వారసుడుగా ఎంపిక చేశారు గనక హరీశ్ సర్దుకుపోవసిందేనని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ఆ విధంగా సర్దుకుంటున్నా తలవంచుకుపోతున్నా హరీశ్‌కు రావలసిన గౌరవస్థానం రావడం లేదనేది ఆయన అనుయాయుల ఫిర్యాదు. వచ్చే ఎన్నికలలోగానే ఆయనపై ఏదో విధంగా వేటు వేస్తే ఆశ్చర్యపోనవసరం లేదని ఒక సీనియర్ పాత్రికేయుడన్నారు.అయితే అలా చేయడం వల్ల విజయావకాశాలు దెబ్బతింటాయి గనకే ముఖ్యమంత్రి కెసిఆర్ తటపటాయిస్తున్నారని అంచనా. ఏది ఏమైనా టిఆర్ఎస్లో ప్రచ్చన్న యుద్ధం తపేట్టు లేదు. ఎన్నికలకు ముందా తర్వాతా అనేదే ఇక్కడ సమస్య.