ఇంతవరకూ ప్రజలు అనుకుంటున్నదే నిజమైంది. రాజధాని అమరావతి నిర్మాణం రానున్న ఎన్నికలకు సమాంతరంగా నడుస్తుందని అధికారిక ప్రకటనతో స్పష్టమైంది. పురపాలక మంత్రిగానే గాక రాజధాని వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మంత్రి నారాయణ 2018 డిసెంబరుకు నిర్మాణాలు ఒక కొలిక్కి వస్తాయని చెప్పారు.అప్పటికి ఎన్నికలు దగ్గరగా వచ్చి వుంటాయి. రాజధానిని త్వరగా కట్టేస్తే వచ్చే ఎన్నికలలో ప్రయోజనం వుండదు. మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు వస్తేనే ఇది సక్రమంగా పూర్తవుతుందని ప్రజలు అనుకోవాలి.అప్పుడే మరోసారి మాకు ఓటేస్తారు. వచ్చే ఎన్నికలలోనూ అదే ఎజెండాగా వుంటుంది అని ఒక సీనియర్ తెలుగుదేశం నాయకుడు చెప్పారు. నారాయణ ప్రకటన కూడా అందుకు తగినట్టే వుంది. ఆ ప్రాంతంలోని పేదలకు 5000 ఇళ్లకు పైగా కట్టిస్తామని కూడా ఆయన తెలిపారు. అయితే ఇవి సరిపోతాయా అన్న సందేహం మిగిలేవుంది. మరోవైపున సీడ్ యాక్సెస్ రోడ్ల నిర్మాణం కోసం భూ సేకరణ వివాదగ్రస్తమవుతున్నది. తాడేపల్లిలో ఈ విషయమై సిఆర్డిఎ అధికారులు ఏర్పాటు చేసినసమావేశం రసాభాసగా ముగిసింది.ఏ భూమి ఎందుకోసం తీసుకుంటున్నారు ఎవరు బాధ్యులు చెప్పాలని రైతులు నిలదీశారట. అధికారులు ఏదో సర్దిచెప్పినా వారు సంతృప్తి చెందలేదు. అధికారులు కూడా అసహనానికి గురై మీరుదొంగలా మేము దొంగలమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సరే పూర్తి వివరాలు ఇస్తే గాని భూములు అప్పగించేది లేదని రైతులు అడ్డం తగిలారు. అర్థంతరంగా సమావేశం ముగించాల్సివచ్చింది.